శనివారం 30 మే 2020
Karimnagar - May 12, 2020 , 01:41:20

కరీం‘నగరం’లో ఆల్‌ నెగెటివ్‌

కరీం‘నగరం’లో ఆల్‌ నెగెటివ్‌

  • కరోనా పాజిటివ్‌ వచ్చిన మరొకరి డిశ్చార్జి
  • మొత్తం 19 మందికి నెగెటివ్‌ 
  • 55 రోజుల్లో నగరంలో కట్టడి
  • పకడ్బందీ చర్యలతో అదుపులోకి

మార్చి 17, 18న ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులతో ఉలిక్కిపడిన కరీం‘నగరం’, ఇప్పుడు ఆల్‌ నెగెటివ్‌తో ఊపిరిపీల్చుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి గంగులతోపాటు అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలివ్వగా, మహమ్మారి అదుపులోకి వచ్చింది. 

కరీంనగర్‌ హెల్త్‌ : మార్చి 16న పది మంది ఇండోనేషియా దేశస్తులను గుర్తించిన జిల్లా అధికారులు వారిని పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇందులో మార్చి 18న ఎనిమిది మందికి పాజిటివ్‌ రావడంతో మంత్రితోపాటు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇండోనేషియన్లు తిరిగిన ప్రాంతాలను గుర్తించి, 19న రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కలెక్టరేట్‌ ప్రాంతంలో మూడుకిలోమీటర్ల పరిధిలో ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా కర్ఫ్యూ ప్రకటించారు. 73 మంది అనుమానితులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు పకడ్బందీగా నివారణ చర్యలు చేపట్టారు. రెడ్‌జోన్లలో ఇండ్లవద్దకే పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులు సరఫరా చేశారు. ప్రజలు ఎక్కడివారు అక్కడే కూరగాయలు కొనుక్కునేలా పౌరసరఫరాలశాఖ అధికారులు మినీ, మొబైల్‌ రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చారు. అయితే మర్కజ్‌ నుంచి వచ్చిన వారితో మరిన్ని కేసులు పెరగడంతో వారిపైనా దృష్టిసారించారు. మొత్తానికి పకడ్బందీ నియంత్రణ చర్యలతో కరోనా కేసుల సంఖ్య 19 దగ్గర ఆగిపోయింది. మరోవైపు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వారిలో గత నెల 24న 17 మందికి నెగెటివ్‌రాగా, వారు డిశ్చార్జి అయ్యారు. మరొకరికి 27న నెగెటివ్‌ రాగా, మిగిలిన ఒకరికి సోమవారం రాత్రి నెగిటివ్‌ వచ్చినట్లు డీఎంఅండ్‌హెచ్‌వో సుజాత తెలిపారు. ఆ వ్యక్తిని హోం క్వారంటైన్‌లో ఉంచుతామని చెప్పారు. పాజిటివ్‌ వచ్చిన వారందరికీ నెగెటివ్‌ రావడంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.  


logo