బుధవారం 27 మే 2020
Karimnagar - May 11, 2020 , 02:51:57

రత్నాకర్‌రావుకు కన్నీటి వీడ్కోలు

రత్నాకర్‌రావుకు కన్నీటి వీడ్కోలు

  • తిమ్మాపూర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
  • హాజరైన మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ 
  • నివాళులర్పించిన మంత్రి గంగుల, ఇతర ప్రముఖులు

ధర్మపురి : మాజీ మంత్రి, రాజకీయ కురువృద్ధుడు జువ్వాడి రత్నాకర్‌రావు(92)కు ప్రజలు, ప్రజాప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన ఆకాంక్ష మేరకు స్వగ్రామం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో గోదావరి ఒడ్డున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు. మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌, ఆర్థిక సంఘం చైర్మన్‌ రాజేశంగౌడ్‌తోపాటు పలువురు ప్రముఖులు రత్నాకర్‌రావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు దవాఖానలో ఆయన తుదిశ్వాస విడిచారని తెలియగానే జగిత్యాల జిల్లాలో విషాదం అలుముకుంది. విషయం తెలిసిన వెంటనే మంత్రులు కొప్పుల, గంగుల కమలాకర్‌ చల్మెడ వైద్యశాలకు వెళ్లి జువ్వాడి పార్థివదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే చెన్నమనేని రాజేశ్వర్‌రావు తర్వాత అత్యంత సీనియర్‌ నాయకుడు రత్నాకర్‌రావేనని గుర్తు చేసుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న రత్నాకర్‌రావు ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయుడని, జగిత్యాల జిల్లా రాజకీయ భీష్ముడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చల్మెడ వైద్యశాల నుంచి ప్రత్యేక వాహనంలో రత్నాకర్‌రావు భౌతికకాయాన్ని తిమ్మాపూర్‌లోని స్వగృహానికి తీసుకెళ్లి సందర్శకుల కోసం కొద్దిసేపు ఉంచారు.  

అధికారిక లాంఛనాలతో.. 

రత్నాకర్‌రావు అంత్యక్రియలను సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు. ఆయన భౌతికకాయాన్ని గ్రామంలోని గోదావరి ఘాట్‌ వద్దకు అంతిమయాత్రగా తీసుకెళ్లారు. అక్కడ పది మంది ఫ్యునరల్‌ గార్డ్స్‌ సిబ్బంది (ఏఆర్‌ కానిస్టేబుళ్లు) తుపాకులతో విన్యాసాలు చేసి గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. రత్నాకర్‌రావు పెద్ద కుమారుడు నర్సింగారావు హిందూ సంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించగా మరో ఇద్దరు కొడుకులు కృష్ణారావు, శేఖర్‌రావు తోడున్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ రాజేశం, రాష్ట్ర నాయకులు కటుకం మృత్యుంజయం, సుద్దాల దేవయ్య, శికారి విశ్వనాథం, సత్యనారాయణ గౌడ్‌, పీసీసీ కార్యదర్శి మహేశ్‌గౌడ్‌, డీఎస్పీ వెంకటరమణ, ఆర్డీవో నరేందర్‌, ఉమ్మడి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ధర్మపురి నాయకులు బాదినేని రాజేందర్‌, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, అయ్యోరి రాజేశ్‌కుమార్‌, సంగి సత్తెమ్మ, శేఖర్‌, సంగనభట్ల దినేశ్‌ పాల్గొన్నారు. జువ్వాడి మృతికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

బూరుగుపల్లితో విడదీయరాని బంధం

గంగాధర : మాజీ మంత్రి జువ్వాడికి గంగాధర మండలం బూరుగుపల్లితో విడదీయరాని అనుబంధం ఉంది. ఇది రత్నాకర్‌రావు అత్తగారి ఊరు కావడంతో ఆయన తరచూ వస్తూపోతూ ఉండేవారు. గ్రామానికి చెందిన సాగి పెద్ద జలపతిరావు, సత్యమ్మ దంపతుల పెద్ద కూతురు సుమలతతో రత్నాకర్‌రావుకు 1951లో వివాహం జరిగింది. రత్నాకర్‌రావు అస్తమయంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రత్నాకర్‌రావు మృతి తీరని లోటు

  • టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు

జువ్వాడి మృతి తీరని లోటని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు సంతాపం తెలిపారు. ధర్మపురి మండలం తిమ్మాపూర్‌ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రత్నాకర్‌రావు అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా రాష్ర్టానికి ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. నిరుపేదలకు అండగా నిలిచి రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పారని తెలిపారు. అజాత శత్రువుగా ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని స్పష్టం చేశారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు. రత్నాకర్‌రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.logo