సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Feb 27, 2020 , 01:09:29

పట్టణ ప్రగతి సద్వినియోగం చేసుకోవాలి

పట్టణ ప్రగతి సద్వినియోగం చేసుకోవాలి

హుజూరాబాద్‌టౌన్‌: పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక-శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా మూడో రోజు బుధవారం పారిశుధ్య పనులు, వార్డుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్ల పొదలను తొలగించారు. ఈ సందర్భంగా 28, 4, 12వ వార్డుల్లో చేపట్టిన పనులను చైర్‌పర్సన్‌ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బల్దియా పరిధిలో 10 జేసీబీలు, ఆరు బ్లేడ్‌ ట్రాక్టర్లు, 10 చెత్త తరలించే ట్రాక్టర్లను ఏర్పాటు చేసి యుద్ధ ప్రతిపాదికన పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు తెలిపారు.  26వ వార్డులో కౌన్సిలర్‌ లావణ్య, ప్రత్యేక కమిటీ సభ్యులు, ప్రత్యేకాధికారి శ్రమదానం చేశారు.  25వ వార్డులో కౌన్సిలర్‌ కిషన్‌ కాలినడకన తిరుగుతూ, మురుగు కాలువలను శుభ్రం చేయించారు. 23వ వార్డులో కౌన్సిలర్‌ మొలుగు సృజనకుమారి, టీఆర్‌ఎస్‌ నాయకుడు పూర్ణచందర్‌లు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్ల పొదలను బ్లెడ్‌ ట్రాక్టర్‌తో  తొలగించారు. 15, 29, 21వ వార్డుల్లో కౌన్సిలర్లు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మురుగు కాలువలు శుభ్రం చేయించి, కొత్త విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేశారు.  కౌన్సిలర్లు బాషబోయిన అనిత, బి యాదగిరినాయక్‌, ఎం కుమారస్వామి, ఎ ముత్యంరాజు, ఎం కొండాల్‌రెడ్డి, గోస్కుల రాజు, కల్లెపల్లి రమాదేవి, మొలుగు సృజనకుమారి, మంద ఉమాదేవి, మారపెల్లి సుశీల, పోతరవేణ రాజకొమురమ్మ, తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్‌, వెన్నంపల్లి కిషన్‌, ముక్క రమేశ్‌, వార్డుల ప్రత్యేకాధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సమస్యల్లేని పట్టణంగా తీర్చిదిద్దాలి

జమ్మికుంట: సమస్యల్లేని పట్టణంగా తీర్చిదిద్దాలనీ, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హుజూరాబాద్‌ ఆర్డీవో బెన్‌షాలోం, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రత్యేకాధికారులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు కాలనీల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 19వ వార్డులో వైస్‌ చైర్‌పర్సన్‌ దేశిని స్వప్న, 23వ వార్డు కౌన్సిలర్‌ పొనగంటి మల్లయ్యలు తమ వార్డుల్లో చెత్తాచెదారం, రోడ్డు పక్కన ఉన్న మట్టిని ఎక్స్‌కవేటర్‌ సహాయంతో తొలగించారు. 26వ వార్డులో ఆర్డీవో పర్యటించారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, తాసిల్దార్‌ డాక్టర్‌ నారాయణ, కమిషనర్‌ అనిసూర్‌ రషీద్‌, వార్డు కౌన్సిలర్‌ రాము, తదితరులు వార్డులోని కాలనీల్లో తిరిగారు. ప్రజలు విన్నవించిన సమస్యలపై చర్చించారు. రోడ్లు, డ్రైనేజీలు లేని చోట వెంటనే పూర్తి చేసేందుకు ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడారు. అందరి సహకారంతోనే పట్టణ ప్రగతి సాధ్యమనీ, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకాధికారులు, కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. 


logo