బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 19, 2020 , 02:29:06

‘పట్టణ ప్రగతి’కి సన్నద్ధం

‘పట్టణ ప్రగతి’కి సన్నద్ధం

జిల్లాలో ‘పల్లె ప్రగతి’ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక పట్టణ ప్రగతికి సన్నద్ధమవుతున్నారు.

  • ఈ నెల 24నుంచి పది రోజులపాటు కార్యక్రమం
  • వార్డు యూనిట్‌గా అభివృద్ధి
  • పచ్చదనం, పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యం
  • నిరక్షరాస్యుల గుర్తింపు
  • మార్కెట్లు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు, డంప్‌ యార్డులు, పార్కింగ్‌ స్థలాల ఏర్పాటు
  • తాగునీటి వ్యవస్థ పటిష్టం, ప్రమాద రహిత విద్యుత్‌ వ్యవస్థకు చర్యలు
  • మున్సిపల్‌ అధ్యక్షులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం
  • అవినీతిని అంతమొందించి.. ప్రజానేతలుగా ఎదగాలని పిలుపు
  • మన పట్టణాలను మనమే మార్చుకోవాలని కర్తవ్యబోధ
  • బల్దియాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీదేనని ఉద్బోధ

జిల్లాలో ‘పల్లె ప్రగతి’ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక పట్టణ ప్రగతికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 24నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంపై నగర మేయర్లు, మున్సిపల్‌ అధ్యక్షులు, కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా బల్దియాల్లో అవినీతిని అంతమొందించి ప్రజా నేతలుగా ఎదగాలని పిలుపునిచ్చిన ఆయన, పట్టణ ప్రగతి కార్యాచరణపై వివరించారు. వార్డు యూనిట్‌గా అభివృద్ధి చేయడంతో పాటు పచ్చదనం, పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మన పట్టణాలను మనమే మార్చుకోవాలనీ, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాల్సిన గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలపై ఉందని కర్తవ్యబోధ చేశారు. 

- కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ


కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో ‘పల్లె ప్రగతి’ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక పట్టణ ప్రగతికి సన్నద్ధమవుతున్నారు. ఈనెల 24నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంపై నగర మేయర్లు, మున్సిపల్‌ అధ్యక్షులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి కార్యాచరణపై వివరిస్తూ ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని ఆదేశించారు. సీఎంతో సమావేశంలో జిల్లా నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు, నగర మేయర్‌ వై సునీల్‌రావు, కలెక్టర్‌ శశాంక, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, ఇతర మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగుపర్చేందుకు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు తెలిపారు.


పట్టణ ప్రగతి కార్యాచరణ 

ఈనెల 24 నుంచి పది రోజుల పాటు చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. ఆ మేరకు వివరాలివి..

*వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వార్డుల వారీగా చేయాల్సిన పనులను, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలి. నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యత కోసం చర్యలు చేపట్టాలి. 

*ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో వార్డులు, డివిజన్ల వారీగా నాలుగు చొప్పున ప్రజాసంఘాలను ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ వచ్చే ఐదు రోజుల్లో పూర్తి కావాలి. 

*పట్టణ ప్రగతిలో పచ్చదనం-పారిశుధ్యం పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

*డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మురుగునీటి గుంతలను పూడ్చివేయాలి.  

*హరిత ప్రణాళిక రూపొందించాలి. విరివిగా మొక్కలు నాటాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. నగరాలు, పట్టణాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. 

*మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య పనుల కోసం మొత్తం 3100 వాహనాలు సమకూర్చుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో జిల్లాకు 600 వాహనాలు వచ్చాయి. మిగతా 2500 వాహనాలను త్వరగా తెప్పించి, పట్టణాలకు పంపాలి. ఇంకా ఎన్ని వాహనాలు అవసరమో అంచనా వేసి, వాటిని సమకూర్చుకోవాలి. 

*మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి.

*పట్టణ ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలి. గుంతలను పూర్తిగా పూడ్చివేయాలి. 

*వైకుంఠధామాల ఏర్పాటు కోసం స్థలాలను ఎంపిక చేయాలి.

*పొదలు, తుమ్మలను నరికి వేయాలి.

*వెజ్‌/నాన్‌వెజ్‌ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని, వాటికోసం స్థలాలను ఎంపిక చేయాలి.

*క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేయాలి.

*డంప్‌ యార్డుల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తించాలి.

*పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్‌ నిర్మించాలి. వీటికోసం స్థలాలు గుర్తించాలి. ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలి. 

*వీధుల్లో వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపే దాకా వారిని ఇబ్బంది పెట్టవద్దు. 

*పార్కింగ్‌ స్థలాలు గుర్తించాలి. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగు కోసం ఏర్పాటు చేయాలి.

*పట్టణాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆధునిక పద్ధతులు అవలంబించాలి. ప్రమాద రహిత విద్యుత్‌ వ్యవస్థ ఉండాలి. వంగిన, తుప్పు పట్టిన స్తంభాలను, రోడ్డు మధ్యలోని స్తంభాలను, ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్లను మార్చివేయాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. 


అవితీనిని అంతమొందించండి

‘ఐదు కోట్ల మంది ఉన్న తెలంగాణలో 140 మందికే చైర్‌పర్సన్లుగా అవకాశం లభించింది. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. అవినీతిని అంతమొందించి నిస్వార్థంగా సేవ చేసి ప్రజా నాయకులుగా ఎదగండి. పదవి అంటే ఒక అధికారం కాదు.. అదొక అసిధార వ్రతం’..అంటూ మున్సిపల్‌ అధ్యక్షులకు సీఎం కేసీఆర్‌ కర్తవ్యబోధ చేశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పల్లె ప్రగతి కార్యాచరణను వివరించడంతో పాటు దిశానిర్దేశం చేశారు. పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలంటేనే ప్రజా సమూహంలో లంచగొండులు, చెత్తా చెదారమనే పేరు పడిపోయిందని, దీన్ని రూపుమాపేందుకు శ్రమించాలన్నారు. ప్రజాశక్తి అన్నింటికంటే ఉత్కృష్టమైందనీ, దాన్ని సమీకృతం చేయగలిగితే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. పట్టణ ప్రగతిని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలనీ, ఆరు నెలలపాటు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ పౌరులు సమష్టిగా కృషి చేస్తే అందమైన నగరాలు కళ్లెదుట సాక్షాత్కారమవుతాయని అభిప్రాయపడ్డారు.


logo