ఆదివారం 31 మే 2020
Karimnagar - Feb 02, 2020 , 01:35:59

ఆర్టీసీ డ్రైవర్లు అభినందనీయులు

ఆర్టీసీ డ్రైవర్లు అభినందనీయులు

కమాన్‌చౌరస్తా: ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌లో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు అభినందనీయులని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కే శశాంక అన్నారు. శనివారం నగరంలోని 2వ డిపోలో ఏర్పాటు చేసిన 31వ జాతీయ రోడ్డు రవాణా భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ కరీంనగర్‌ రీజియన్‌ డ్రైవర్లు విధుల పై అంకితభావం, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనీ, ప్రమాదాలను నివారించి సంస్థను లాభాల బాటలో నడిపించడానికి కృషి చేయాలని సూచించారు. డ్రైవర్లు స్వీయ భద్రతతో పాటుగా సామాజిక భద్రతను కూడా పాటించాలన్నారు. డీటీఓ పుప్పాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆర్టీసీలో డ్రైవర్ల పాత్ర అభినందనీయమన్నారు. క్రమశిక్షణతో పాటు వారు విధి నిర్వహణలో అనునిత్యం అప్రమత్తంగా ఉంటారని అభినందించారు. ప్రమాదాల రేటును పూర్తిగా తగ్గించేందుకు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఆర్‌ఎం పీ జీవన్‌ప్రసాద్‌ మాట్లాడుతూ రీజియన్‌లో ప్రమాదాల రేటు తగ్గిందన్నారు. 2013-14లో 0.08 శాతం ఉన్న రేటు 2018-19లో 0.06 శాతానికి తగ్గిందని తెలిపారు. జిల్లాలో వేములవాడ, మెట్‌పల్లి, మంథని డిపోలు అతితక్కువ ప్రమాదాలతో వరుసగా 0.03, 0.07, 0.04 నమోదయ్యాయన్నారు. మెట్‌పల్లి 2018-19లో డిపో కేటగిరీ 1లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం పొందిందనీ, ఇందులో ఇక్కడి డీఎం విజయారావు కృషి అభినందనీయమన్నారు. 


రీజియన్‌లో   ప్రమాదాలను ‘0’ స్థాయికి తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే సంవత్సరం నాటికి రీజియన్‌లో పూర్తిగా ప్రమాదాలను నివారిస్తామనీ, అంతా కలిసి శక్తివంచన లేకుండా కృషిచేసి సంస్థను లాభాలబాటలో నడిపిస్తామని ఆర్‌ఎం పీ జీవన్‌ప్రసాద్‌తోపాటుగా డ్రైవర్లు సంస్థ ఉద్యోగులందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. నేడు ఆర్టీసీ జోనల్‌ దవాఖానలో ఉదయం 11 గంటలకు 150 దాతలతో రక్తదాన  శిబిరం నిర్వహిస్తున్నామని ఆర్‌ఎం తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక కాలం ప్రమాద రహిత డ్రైవింగ్‌తో జోన్‌, రీజియన్‌, డిపోల స్థాయిల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన డ్రైవర్లను కలెక్టర్‌ శశాంక పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సన్మానించారు. ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి ఆర్టీసీ అథ్లెటిక్స్‌ 45 సంవత్సరాల విభాగంలో జరిగిన పోటీలో విజయం సాధించిన కరీంనగర్‌ 2వ డిపోకు చెందిన జీ రాజయ్యను డీటీఓ శ్రీనివాస్‌, ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్‌లు మెడల్స్‌తో పాటు ప్రశంసాపత్రం అందించి సన్మానించారు. కార్యక్రమంలో సీపీ కమలాసన్‌రెడ్డి, ఏఓ లావణ్య, పీఏ ప్రసన్నకుమార్‌, జ్యోత్స్న, డీవీఎంలు, ఆర్‌ఎం డిపో కార్యాలయాల సిబ్బంది, 1, 2వ డిపోల మేనేజర్లు అర్పిత, మల్లేశంలతో పాటు రీజియన్‌ పరిధిలోని అన్ని డిపోల మేనేజర్లు డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.logo