కార్పొరేషన్, డిసెంబర్ 19: నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. నగరంలోని 32వ డివిజన్లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో స్మార్ట్‌సిటీ, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పట్టణ ప్రగతి నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం కోడ్ ముగియడంతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మంచినీటి సరఫరా, మురుగు కాలువలు, రోడ్ల నిర్మాణ పనులకు ప్రాధాన్యమిచ్చి చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు మార్కెట్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ భావన, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.