పంపిణీకి ఏర్పాట్లు
కొవిడ్ నిబంధనలకనుగుణంగా క్రిస్మస్ విందులు
పెద్దపల్లి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈ నెల 25న క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఈ నెల 19 నుంచే దుస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేయాలని నిర్ణయించడంతో ఇప్పటికే ఆ గిఫ్ట్(ఒక ప్యాంటు, షర్టు, ఒక చీర, ఒక పంజాబీ డ్రెస్ మెటీరియల్ కలిగిన)ప్యాక్‌లు ఆయా నియోజకవర్గ కేంద్రాలకు చేరుకున్నాయి. ప్రతి నియోజకవర్గంలోని 1000 మంది క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేయనుండడంతోపాటు ముందస్తుగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించి పంపిణీ చేయనున్నారు. నేరుగా జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలకు ఈ గిఫ్ట్ ప్యాక్‌లను పంపి ఆ తర్వాత అక్కడ క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, రెవెన్యూ అధికారుల ద్వారా పంపిణీ చేస్తారు. అర్హులను ఎంపిక చేసేందుకు ఆయా మండలాల తహసీల్దార్లకు జీవో నెంబర్ 239 ద్వారా ఆదేశాలు అందాయి. అనాథలు, ముసలి వాళ్లు, కుష్టు, వైకల్యం కలిగిన వారిని ముందు అర్హులుగా, ఆ తర్వాత మిగతా వారికి అందజేస్తారు.
పెద్దపల్లి జిల్లాకు 6 వేల గిఫ్ట్ ప్యాక్‌లు
క్రిస్మస్ పండుగకి నియోజకవర్గానికి 1000 చొప్పును గిఫ్ట్ ప్యాక్‌లను అందజేస్తుండగా రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సొంత జిల్లా పెద్దపల్లి కావడంతో ప్రత్యేక చొరవతో పెద్దపల్లి జిల్లాకు 6 వేల గిఫ్ట్ ప్యాక్‌లు అందాయి. ఇందులో జిల్లాలోని రామగుండం నియోజకవర్గానికి అత్యధికంగా 2500, పెద్దపల్లి నియోజకవర్గానికి 2 వేలు, మంథని నియోజకవర్గానికి 1500 గిఫ్ట్ ప్యాక్‌లు వచ్చాయి.
18మండలాలకు గిఫ్ట్ ప్యాక్‌లు
పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల గిఫ్ట్ ప్యాక్‌లు జిల్లాకు చేరాయి. ఇందులో పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ఎలిగేడు, జూలపల్లి, రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం, పాలకుర్తి, రామగుండం అర్భన్ మండలాలు, మంథని నియోజకవర్గంలోని మంథని, రామగిరి, కమాన్‌పూర్, ముత్తారం, జయశంకర్ జిల్లా పరిధిలోని కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల క్రైస్తవ సోదరులకు ఈ గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నారు. జిల్లా పరిధిలోని ధర్మారం మండలం ధర్మపురి నియోజకవర్గంలో ఉండడంతో జగిత్యాల జిల్లా నుంచి ఆ మండలానికి గిఫ్ట్ ప్యాక్‌లు అందనున్నాయి.