జమ్మికుంట రూరల్, డిసెంబర్ 18: బయోఫ్లాక్ పద్ధతిలో చేపల పెంపకంతో అధిక దిగుబడి సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు తెలిపారు. పీఎంఎంఎస్వై కింద దరఖాస్తు చేసుకున్న వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాలకు చెందిన యువతీయువకులకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఐదురోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. చివరి రోజు కేవీకే మత్స్యశాస్త్రవేత్త జే ప్రభాకర్, బోధకులు అఖిల్కుమార్, శివానీ, సుష్మ, సోని ఈ విధానంలో చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. శిక్షణ ముగిసిన తర్వాత యువకులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ, యువతీ యువకులకు తక్కువ విస్తీర్ణంలో జీవసమూహ పద్ధ్దతిలో చేపల పెంపకం తీరును సమగ్రంగా వివరించామని తెలిపారు. నీటి నాణ్యతాప్రమాణాలు, వ్యాధి నిర్ధారణ, మూల పెట్టుబడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక సాయం, మేత యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
చేపల పెంపకం అంటే ఇష్టం..
స్వయం ఉపాధికి ఈ శిక్షణ దోహదపడుతుంది. ఇంటర్ చదువుతున్నప్పుడు టీచర్లతో కలిసి జమ్మికుంట కేవీకేకు వచ్చిన. ప్రస్తుతం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. చిన్నప్పటి నుంచి చేపల పెంపకం అంటే ఎంతో ఇష్టం. అందుకే శిక్షణ తరగతులకు హాజరైన.
-మారేపల్లి సుస్మిత, ధర్మారం (జమ్మికుంట మున్సిపల్ పరిధి )
చేపల పెంపకంతో అధిక లాభం
చేపల పెంపకం ఎంతో లాభదాయకం. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చు. కేవీకేలో బయోఫ్లాక్ విధానంపై ఇచ్చిన శిక్షణ బాగున్నది. సార్లు సమగ్రంగా వివరించారు. దళిత బంధు పథకం కింద మంజూరైన రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి చేపల పెంపకాన్ని చేపడుత.
-మారుముల్ల కిరణ్, వల్భాపూర్, వీణవంక మండలం