కోరుట్ల ఆనంద్షాపింగ్మాల్లో భారీ అగ్ని ప్రమాదం
అగ్నికీలల ధాటికి దగ్ధమైన భవనం
ఇన్వర్టర్ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం
రూ. 18 కోట్ల మేర ఆస్తి నష్టం
పక్క షాపునకు వ్యాపించిన మంటలు..
కాలి బూడిదైన ఫర్నిచర్
కోరుట్ల, ఆగస్టు 18: జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆనంద్ షాపింగ్‌మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ. 18 కోట్ల ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో షాపులోని క్యాష్ కౌంటర్ వద్ద మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో దుకాణంలో దావానాలంలా వ్యాపించాయి. చుట్టు పక్కల వారు చూసి వెంటనే షాపు నిర్వాహకులకు తెలియజేశారు. వారు అక్కడికి చేరుకొని మెట్పల్లి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో సమీపంలోని ఆర్మూర్, జగిత్యాల, ధర్మపురి ఫైర్ స్టేషన్ల నుంచి ఫైరింజన్లను తెప్పించారు. అగ్నికిలలధాటికి నాలుగు అంతస్తుల ఆనంద్ షాపింగ్ మాల్ భవనం పూర్తిగా దగ్ధమైంది. భవనంలోని ఫర్నిచర్. వస్ర్తాలు, ఏ/సీలు, ఇన్వర్టర్ బ్యాటరీలు, వస్ర్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్ల విలువైన భవనం, రూ. 12 కోట్ల విలువైన వస్ర్తాలు కాలిపోయినట్లు షాపింగ్ మాల్ అధినేత చింతకింది హరిప్రసాద్ తెలిపారు. మెయిన్ బ్రాంచ్ ఆయినా కోరుట్ల నుంచి మెట్పల్లి, జగిత్యాల, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఆనంద్ షాపింగ్ మాల్స్‌కు బట్టలను పంపిస్తామని, శ్రావణ మాసం సందర్భంగా రెండు రోజుల క్రితమే పెద్దమొత్తంలో బట్టలు కొనుగోలు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా షాపింగ్ మాల్‌కు అనుసంధానంగా ఉన్న ట్రాన్స్‌పార్మర్‌లో సాంకేతిక ఇబ్బందుల కారణంగా షాపింగ్ మాల్‌కు విద్యుత్ సరఫరా మంగళవారం నిలిచిపోయింది. దీంతో జనరేటర్, బ్యాటరీ ఇన్వర్టర్ల సాయంతో షాపులోని విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించారు. ఈక్రమంలో గ్రౌండ్ ప్లోర్లో ఉన్న క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న బ్యాటరీ ఇన్వర్టర్లో అర్ధ్దరాత్రి సమయంలో షాట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమిక ఆంచనాకు వచ్చారు. ఆనంద్ షాపింగ్ మాల్‌కు వెంటి లేషన్ సౌకర్యం సరిగా లేని కారణంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి తొందరగా షాపు మొత్తానికి వ్యాప్తి చెందాయని డీఎఫ్‌వో మురళీ మనోహర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
పక్క దుకాణానికి మంటల వ్యాప్తి..
కోరుట్లలోని ఆనంద్ షాపింగ్ మాల్లో చెలరెగిన మంటలు పక్కనే నూతనంగా నిర్మించిన భవనానికి సైతం వ్యాపించాయి. ఆ షాఫులో పట్టణానికి చెందిన రాచర్ల సునీల్ అనే వ్యక్తి మెన్స్ వేర్, కిడ్స్ వేర్‌ను ఏర్పాటు చేసేందుకు కొద్ది రోజులుగా ఫర్నీచర్ పనులు చేపడుతున్నాడు. మరో వారం రోజుల్లో షాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నాడు. ఈ తరుణంలో ఆనంద్ షాపింగ్ మాల్లో అంటుకున్న అగ్నికీలలు ఎగిసి భవనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. దీంతో పాటూ ఫర్నీచర్ పనులు నిర్వహిస్తున్న కార్మికులకు చెందిన రూ. 60 వేల విలువైన సామగ్రి కాలి బూడిదైంది. వ్యాపారం ప్రారంభిక ముందే ఇలాంటి సంఘటన జరుగడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు.