సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం
సదుపాయాల కల్పనపై బల్దియా ప్రత్యేక దృష్టి
కార్పొరేషన్, డిసెంబర్ 17: నగరంలోని రేకుర్తిలో ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర కోసం నగరపాలక సంస్థ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. బల్దియా ఇంజినీరింగ్ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణాగౌడ్, రాజశేఖర్ సమన్వయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. జాతర కోసం బల్దియా రూ. కోటి ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నిధులతో పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు, శాశ్వత మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణాలు చేపడుతున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద కూడా సీసీ పనులతో పాటు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు మరిన్ని నిధులు కేటాయించి పనులు చేపడుతున్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా పనులు
రేకుర్తిలోని సమ్మక్క గద్దెల వద్ద రెండేళ్లకోసారి జరిగే జాతరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రెండేళ్ల క్రితం నగరపాలక సంస్థ అతి తక్కువ సమయంలో భారీగా ఏర్పాట్లు చేసింది. కాగా, ఫిబ్రవరిలో జరిగే జాతర కోసం రెండు నెలల ముందుగానే నగరపాలక సంస్థ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించింది. జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాల రోడ్డు నుంచి సమ్మక్క గద్దెల వరకు సీసీ రోడ్ల నిర్మాణం, జాతర ప్రాంతంలో ఇబ్బంది కలుగకుండా సీసీ పనులు చేపట్టనున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న క్యూలైన్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. వీటిని మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, గద్దెల వెనుక ఉన్న చిన్న కుంటను మట్టితో నింపి చదును చేయిస్తున్నారు.
భారీ లైటింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు
జాతరలో భారీ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల ప్రధాన రహదారి నుంచి జాతర ప్రాంతం వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు గద్దెల ప్రాంతంలో భారీ లైటింగ్ టవర్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మంచినీటి సదుపాయం, గద్దెల చుట్టూ ఎక్కువ స్థలం ఉండే విధంగా చూస్తున్నారు. దీంతో పాటు గద్దెల ప్రాంతంలో కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని క్యూలైన్లను విస్తరించడంతో పాటు దర్శనానికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
జాతరకు భారీ ఏర్పాట్లు
జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. రెండు నెలల్లోగా సీసీ రోడ్లు, మట్టి పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. అనుకున్న గడువులోగా జాతరలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. భక్తులకు రాత్రి సమయంలో ఇబ్బంది కలుగకుండా లైటింగ్ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. జాతర సమయంలో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు తయారు చేశాం.