హుజూరాబాద్, డిసెంబర్ 17: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో రైతుబంధు ప్రధానమైనది. పెట్టుబడి సమయంలో అన్నదాతలు గతంలో ఎన్నో ఇబ్బందులు పడేటోళ్లు. పట్టించుకునే నాథుడు లేకపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సమయంలో ఆదుకునేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాసుబుక్కులు పొందిన రైతులకు దరఖాస్తు చేసుకొనేందుకు వీలు కల్పించింది. డివిజన్లో ప్రస్తుతం 63,636 మంది అన్నదాతలు రైతుబంధు పథకంతో లబ్ధిపొందుతున్నారు. 2018 వానకాలం పంట నుంచి రాష్ట్ర సర్కారు పథకాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తున్నది.
దరఖాస్తు గడువు నాలుగు రోజులే..
రైతుబంధు పథకం దరఖాస్తు గడువు నాలుగు రోజులే ఉంది. ఈ ఏడాది జూన్ 10వ తేదీ తర్వాత ధరణి ఫోర్టల్‌లో ఉన్న వివరాల ఆధారంగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు పట్టాదారు పాసుబుక్కులు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయాధికారులు తెలిపారు. అలాగే కొత్తగా వ్యవసాయ భూమి కొనుగోలు చేసి సంబంధిత వివరాలను పాత పట్టాదారు పాసుపుస్తకంలో నమోదైన రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో సంవత్సరం పొడవునా దరఖాస్తుకు అవకాశం ఉండగా, ఇప్పుడు డిసెంబర్ 16తేదీ నుంచి 19వ తేదీ వరకే ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇతర సందేహాలకు తనను సంప్రదించాలని ఏఈవో సూచించారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వ కల్పించింది. పట్టాదారు పుస్తకం, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ ప్రతులు దరఖాస్తుకు జతచేసి ఇవ్వాలి. ఇప్పటికే రైతుబంధు పొందుతున్నవారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.