డాక్టర్ సీహెచ్ వికాస్
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందుర్తికి అంబులెన్స్ అందజేత
రుద్రంగి (చందుర్తి), డిసెంబర్ 17: మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతిమ ఫౌండేషన్ కృషి చేస్తున్నదని డాక్టర్ చెన్నమనేని వికాస్ పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఎస్పీ చంద్రశేఖర్, స్థానిక నేతలతో కలిసి శుక్రవారం ఆయన చందుర్తికి అంబులెన్స్ సేవలను ప్రారంభించి, మాట్లాడారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు శాతం నిధులను సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంత ప్రజలకు వైద్యం, విద్య, స్వయం ఉపాధి అందించాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, మందులు అందిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, గర్భిణులకు అత్యవసర చికిత్స అందించేందుకు అంబులెన్స్ ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని రుద్రంగితోపాటు సమీప గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం చెన్నమనేని వికాస్-దీప దంపతులను గ్రామస్తులు సన్మానించారు. ఎంపీపీ బైరగోని లావణ్య, జడ్పీటీసీ నాగం కుమార్, సర్పంచ్ సిరికొండ ప్రేమలత, నాయకులు బైరగోని రమేశ్, శ్రీనివాస్, సిర్రం తిరుపతి, మార్త సత్తయ్య, గణేశ్, ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది ఉన్నారు.