పంట మార్పిడితోనే రైతులకు మేలు
కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్
ఏరువాక కేంద్రంలో రైతు సదస్సు- వ్యవసాయ ప్రదర్శన ప్రారంభం
కొత్తపల్లి, డిసెంబర్ 17: యాసంగిలో రైతులు ఇతర పంటల సాగుపై దృష్టిసారించాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. పంట మార్పిడితోనే రైతులకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ శివారు పద్మనగర్లోని జిల్లా ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు-వ్యవసాయ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ముందుగా వ్యవసాయ పరిశోధనా స్థానంలో హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రోన్ యంత్రాన్ని తిలకించారు. పంట పొలాలకు డ్రోన్ సాయంతో ఎకరానికి 10 లీటర్ల పురుగుల మందును 10 నిమిషాల్లో స్ప్రే చేయవచ్చని వ్యవసాయాధికారులు కలెక్టర్కు వివరించారు. డ్రోన్ పిచికారీ చేసే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఇతర ఆధునిక యంత్రాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ ప్రదర్శనను ప్రారంభించారు. విత్తనాలు, సమగ్ర సస్యరక్షణ, ఆరుతడి పంటల వంగడాలు, మల్చింగ్ విధానం, మొక్కలు, సమగ్ర వ్యవసాయం, తుంపర సేద్యం, బిందు సేద్యం, నిలువు వ్యవసాయం, ఆక్వాపోనిక్స్, హైడ్రోపోనిక్స్, సోలార్ డ్రయర్, మంకీ గన్, క్రాప్ అడ్వైజరీ సెంటర్, కార్బన్ సేంద్రియ ఎరువు తదితర ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. రైతులు వానకాలంలో వరి వేసినప్పటికీ యాసంగిలో ఆరుతడి పంటలపై దృష్టిసారించాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పనిముట్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకుసాగాలన్నారు. రైతులు ఒకరి అనుభవాలను ఒకరు పంచుకోవాలని, వ్యవసాయాధికారుల సూచనలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు రైతుల పంట పొలాలను సందర్శించాలని, వారి అనుభవాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో తిరిగితే వ్యవసాయ విధానాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.మంజులత, ఉత్తర తెలంగాణ మండల సహ సంచాలకురాలు డాక్టర్ ఉమాదేవి, శాస్త్రవేత్తలు డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ ఈ రజినీకాంత్, డాక్టర్ జీ ఉషారాణి, డాక్టర్ డీ శ్రావణి, డాక్టర్ కే మధన్మోహన్రెడ్డి, జమ్మికుంట కేవీకే సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ప్రైవేట్ కంపెనీల సిబ్బంది, దత్తత, ఇతర గ్రామాలకు చెందిన 200మంది రైతులు పాల్గొన్నారు.