బతికుంటే భూమి దక్కదని ప్లాన్
సుపారీ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని మరీ చంపించిన కూతురు
తాళ్ల ధర్మారంలో ఘటన
తాజాగా వీడిన మిస్టరీ.. ఇద్దరి అరెస్ట్
వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ
జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 17: భూమి కోసం కన్న కూతురు దారుణానికి ఒడిగట్టింది. తండ్రి బతికుంటే తనకు భూమి రాదని, ఎలాగోలా అతడిని చంపాలని నిర్ణయించుకుంది. తనకు వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో కలిసి పథకం వేసింది. అతడికి సుపారీ ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఇంకేముంది మూడో కంటికి తెలియకుండా తండ్రిని హత్య చేయించి ఏమీ ఎరుగనట్టు కన్నీరు పెట్టింది. పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలింది. కేసు ఛేదించి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ వివరాలను జగిత్యాల డీఎస్పీ రత్నపురం ప్రకాశ్ బుధవారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్లధర్మారం గ్రామానికి చెందిన జూపెల్లి నర్సయ్య (65)కు భార్య మల్లవ్వ, కూతురు సత్తవ్వ అలియాస్ లక్ష్మి ఉంది. సత్తవ్వను బీర్పూర్ మండలం రేకులపల్లె గ్రామానికి చెందిన కాడ పర్వతాలుకు ఇచ్చి వివాహం చేశాడు. పర్వతాలు జీవనోపాధి కోసం ముంబై వెళ్లాడు. సత్తవ్వ తాళ్లధర్మారంలోని తన పుట్టింట్లో ఉంటున్నది. ఈ క్రమంలో గ్రామానికి చెందన బర్ల గంగాధర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. విషయం తెలిసిన నర్సయ్య కూతురితోపాటు గంగాధర్‌ను తరచూ మందలించేవాడు. ఇదే విషయమై భార్య మల్లవ్వతోనూ గొడవపడేవాడు. గొడవలు ముదరడంతో మల్లవ్వ విసుగు చెంది ఏడాదిగా బీర్‌పూర్‌లోని తన సోదరి ఎల్కుసి నర్సవ్వ వద్ద ఉంటున్నది. ఈక్రమంలో నర్సయ్య తన వ్యవసాయభూమిని అమ్మకానికి పెట్టాడు. అతడి భార్య, కూతురు అంగీకరిస్తేనే కొంటామని పలువురు చెప్పారు. దీంతో నర్సయ్య తన భార్య, కూతురు సత్తవ్వను ఒప్పించే ప్రయత్నం చేయగా వారు నిరాకరించారు. అయినా భూమి విక్రయ నిర్ణయాన్ని విరమించుకోలేదు. దీంతో ఎలాగు భూమి తనకు దక్కదని భావించిన సత్తవ్వ తండ్రిని చంపేందుకు కుట్ర పన్నింది. బర్ల గంగాధర్‌కు విషయం తెలిపి భూమిలో హత్యకు పది శాతం సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం నర్సయ్య వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన గంగాధర్ బావి వద్దకు వెళ్లి పదునైన కత్తితో నర్సయ్య గొంతు కోసి చంపాడు. శవాన్ని బావిలో పడేసి వెళ్లిపోయాడు. నర్సయ్య హత్య విషయం 11న వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్ కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. సత్తవ్వ, గంగాధర్‌ను విచారించడంతో నర్సయ్యను హత్య చేసినట్లు వారు అంగీకరించారు. దీంతో వారిని బుధవారం అరెస్ట్ చేశారు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, బీర్పూర్ ఎస్ఐ నైనిశారెడ్డి పాల్గొన్నారు.