రైతన్నకు అండగా టీఆర్ఎస్ మహాధర్నా
యాసంగి వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నేడు ఇందిరా పార్క్ వద్ద పోరు
ఉమ్మడి జిల్లా నుంచి తరలిన ప్రజాప్రతినిధులు
దిగివచ్చే వరకూ వదిలిపెట్టబోమంటూ స్పష్టం
కరీంనగర్/ పెద్దపల్లి నవంబర్ 17(నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్ రూరల్: తెలంగాణ రైతాంగం కోసం కేంద్రంతో రాష్ట్ర సర్కారు ప్రత్యక్ష సమరానికి సిద్ధమైంది. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేడు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నది. బీజేపీ సర్కారు ద్వంద్వ వైఖరి, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఎండగడుతూ పోరాటానికి సిద్ధమవుతున్నది. యాసంగిపై స్పష్టత ఇచ్చేదాకా వెనక్కితగ్గేది లేదని తేల్చి చెబుతున్నది. ఈ ధర్నాకు ఉమ్మడి జిల్లానుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, సహకార బ్యాంక్ చైర్మన్లు, ఆర్బీఎస్ అధ్యక్షులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సర్వం సిద్ధమైంది.
ధాన్యం కొంటరా..? కొనరా..? యాసంగిలో వరి ధాన్యం వెయ్యాలా..? వద్దా..? అనేది కేంద్ర ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై యుద్ధానికి సిద్ధమైంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఖరిని, రాష్ట్ర బీజేపీ తీరును ఎండగట్టాలని ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, సహకార బ్యాంక్ చైర్మన్లు, రైతు బంధు సమితుల అధ్యక్షులతోపాటు నాయకులు తరలివెళ్లనున్నారు. బుధవారమే కొందరు నాయకులు హైదరాబాద్ వెళ్లారు. బుధవారం సాయంత్రం సిరిసిల్లలో పర్యటించిన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
యాసంగిపై పూర్తి హామీ ఇవ్వాలి..
లక్షలాది మంది రైతులకు నష్టం కలుగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ఆ హామీ వచ్చేదాకా ఆందోళన ఆగదు. యాసంగికి ఎలాంటి హామీ లేకపోతే రైతన్నలు అయోమయంలో ఉండి ఏ పంట పండించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రైతుల అయోమయాన్ని దూరం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. రైతులకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి న్యాయం జరిగేదాకా ఉద్యమిస్తాం. ప్రతి రైతుకు అండగా నిలుస్తాం. బీజేపీని నిలదీస్తాం.
ఏ మాత్రం పొంతన లేదు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాటలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మాటలకు ఏ మాత్రం పొంతన లేదు. కేంద్రం స్పష్టంగా రాబోయే రోజుల్లో బాయిల్డ్ రైస్ కొనబోమని, రా రైస్ మాత్రమే కొంటామంటున్నది. రా రైస్ విషయంలో సైతం స్పష్టత లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లి కలిసినా సరైన స్పందన లేదు. తక్షణమే ఎన్ని లక్షల టన్నుల ధాన్యాన్ని కొంటరో చెప్పాలి. ఇక్కడ పార్టీ నాయకులు మొత్తం కొంటామంటున్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చే పంట 40లక్షల టన్నులు మాత్రమే కొంటామంటున్నది. మిగిలిన పంట ఏం చేయాలి? ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. అప్పటివరకూ కేంద్రంపై రాష్ట్ర పోరు ఆగదు.
మండలి విప్ టీ భానుప్రసాద్‌రావు కుట్రలను తిప్పి కొడుతాం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతన్నను నిలువునా ముంచేందుకు చేస్తున్న కుట్రలను తిప్పి కొడదాం. కేంద్రం దిగొచ్చేదాకా ఉద్యమిస్తాం. అనేక ఉద్యమాలు చేసిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ రైతుకు మేలు జరిగేంత వరకూ ఉద్యమిస్తుంది. సాగునే నమ్ముకున్న రైతన్నకు మేలు చేయకపోతే సహించేది లేదు. యాసంగి ధాన్యాన్ని కొనబోమని చెప్పడం అంటే తెలంగాణ రైతన్నపై శఠగోపం పెట్టడమే. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సాగును బంగారంగా చేస్తే.. బీజేపీ ప్రభుత్వమేమో రైతన్నను నిలువునా ముంచుతున్నది.
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
బీజేపీ ప్రభుత్వానిది ద్వంద్వ నీతి
వడ్ల సేకరణ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వంద్వనీతిని పాటిస్తున్నది. గతానికి భిన్నంగా ఇప్పుడు కేంద్రం యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయబోమని తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెట్టడం అత్యంత బాధాకరం. పంజాబులో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, తెలంగాణలో కొనుగోలు చేయకపోవడం బీజేపీ కుటిల నీతికి నిదర్శనం. పంజాబ్‌లో వర్షాకాలంలో గోధుమలు పండిస్తారు, యాసంగిలో వడ్లు పండిస్తారు, పంజాబ్ ప్రజలు ఏడాది పొడవునా గోధుమలే తింటారు. వరి అన్నం తినరు. తెలంగాణలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే 30 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలు ఆహారంగా వినియోగించుకుంటున్నారు. కేంద్రం కొనాల్సింది మిగిలిన 60 లక్షల మెట్రిక్ టన్నులే. కేంద్రం పంజాబ్‌కు ప్రాధాన్యత ఇచ్చి, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలాగా కొనుగోళ్లు జరిపించాలి. మార్కెట్ యార్డుల్లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్‌సీఐ అధికారులను ఉంచి వరిని కొనుగోలు చేయించాలి. కేంద్రం వరి కొనుగోళ్లు జరిపేదాకా తెలంగాణ పోరాటం జరుపుతూనే ఉంటుంది.
రైతులను మోసం చేస్తున్నది..
వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. యాసంగిలో బాయిల్డ్ రైస్ పేరుతో దొడ్డు రకం వడ్లను కొనేందుకు నిరాకరిస్తూ తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నది. ధాన్యం కొనుగోలుపై స్పష్టత వచ్చేదాకా తెలంగాణ రైతాంగం తరపున టీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈనెల18న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే వచ్చే యాసంగిలో వడ్లు కొంటామని కేంద్రం నుంచి లేఖ ఇప్పించాలి. యాసంగిలో వడ్డు కొంటామని మూడు రోజుల్లోగా కేంద్రం స్పష్టత ఇవ్వాలి. లేదంటే సీఎం కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారు.