తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 17: ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం నుంచే మెళకువలను నేర్చుకుని బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలని జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు సూచించారు. మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. 25 ఏళ్లలో కళాశాల సాధించిన విజయాలను తెలుపుతూ రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జువ్వాడి సాగర్‌రావు మాట్లాడుతూ.. 1997లో కళాశాలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. తక్కువ సమయంలోనే ఆరు యూనివర్సిటీ, రెండు ఫౌండేషన్ గోల్డ్‌మెడల్స్‌ను సాధించిన ఘనత తమ విద్యాసంస్థలదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అటానమస్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు విద్య, కళాశాల విధివిధానాలపై అవగాహన కల్పించారు. ప్రథమ సంవత్సరంలో అర్హులైన 13 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.30 వేల చొప్పున స్కాలర్షిప్లను అందజేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ వైశాలి, కో ఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్, హెచ్వోడీలు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ విశ్వప్రకాశ్ పాల్గొన్నారు.