పెద్దపల్లి జంక్షన్, నవంబర్ 15: జాతీయ రహదారి నిర్మాణానికి భూ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి భూసేకరణ చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ అంశంపై సంబంధిత కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, భూ సర్వే, భూ సేకరణ పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో 38.07 కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, వరంగల్ మార్గంగా వెళ్తున్న రహదారి కోసం మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 16 గ్రామాల పరిధిలో 493 ఎకరాల భూ మిని సేకరించాల్సి ఉందన్నారు. ఇందుకు సర్వే పనులు సాగుతున్నాయని, ఇప్పటిదాకా 16.9 కిమీ పైగా భూ సర్వే పూర్తి అయిందని, మిగతాది త్వరగా పూర్తి చేసి ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ఇక్కడ అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, జీ విభాగం పర్యవేక్షకుడు దత్తుప్రసాద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు క్షేత్ర స్థాయిలో త్వరగా పరిశీలించాలని, పరిష్కరించాలని ఆమె సూచించారు.