హుజూరాబాద్‌లో 20 వేల కుటుంబాలకు ఇచ్చితీరుతాం
బీజేపీ, కాంగ్రెసోళ్లు అపోహలు సృష్టిస్తున్నరు
కుట్ర, కుతంత్రాలు చేస్తే మాడిమసైతరు
చెప్పుడు మాటలు వినొద్దు
దళిత జాతిపై ‘బండి’కి ప్రేముంటే కేంద్రం నుంచి ఒక్కో కుటుంబానికి 40 లక్షలు ఇప్పించాలి
అలా తెస్తే మేమే పాలాభిషేకం చేస్తాం
ఇది ఎన్నికల పథకం కాదు.. గత బడ్జెట్లోనే ప్రవేశపెట్టాం
విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
శాలపల్లి-ఇందిరానగర్‌లో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
అధికారులకు దిశానిర్దేశం
హుజూరాబాద్, ఆగస్టు 14 : ‘ఎవరెన్ని అడ్డకుంలు సృష్టించినా దళితబంధు పథకం ఆగదు. ఆరునూరైనా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20 వేల కుటుంబాలకు ఇచ్చి తీరుతాం. బీజేపీ, కాంగ్రెసోళ్లు అపోహలు సృష్టిస్తున్నరు. కుట్రలు, కుతంత్రాలు చేస్తే మాడి మసైపోతరు.’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పథకం అమలు విషయంలో చెప్పుడు మాటల వినవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దళిజాతిపై ఎంపీ బండి సంజయ్‌కు ప్రేముంటే కేంద్రం నుంచి ఒక్కో కుటుంబానికి 40 లక్షలు ఇప్పించాలని, అలా చేస్త తామే పాలాభిషేకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు హుజూరాబాద్‌లో మరో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం శాలపల్లి-ఇందిరానగర్ వద్ద ఈ నెల 16న జరిగే సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దళితబంధు పథకంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తే మాడి మసైపోతారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పథకాన్ని అమలు చేసి తీరుతామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని సిటీసెంటర్హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంత ఉన్నతమైన పథకాన్ని స్వాగతించి సహకరించాల్సింది పోయి.. బీజేపీ నాయకులు, కొన్ని సంఘాల వారు ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించి అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. రైతుబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రారంభించిన సమయంలోనూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇలానే విమర్శలు చేశారని గుర్తు చేశారు. రైతు బంధు నిరాటంకంగా అమలవుతున్న విషయం తెలిసిందేనన్నారు. ఇదే రైతుబంధును హుజూరాబాద్‌లో ప్రారంభించిన రోజు చప్పట్లు కొట్టి స్వాగతించిన నాయకుడు, ఈ రోజు దళితబంధును ఇదే గడ్డపై ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారన్నారు. పోయిన బడ్జెట్ సమావేశాల్లోనే ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నామని తానే ఆర్థికశాఖ మంత్రిగా చెప్పానన్నారు, త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలవుతాయని బడ్జెట్ ప్రసంగంలోనే కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. మార్చి బడ్జెట్ సమయంలో అప్పుడు ఏ ఎన్నికలు లేవని, దళితుల అభ్యున్నతి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ఆ రోజే స్పష్టం చేశామన్నారు.
నాడు ఒప్పు.. నేడు తప్పెలా?
ఇదే హుజూరాబాద్‌లో గతంలో రైతుబంధు ప్రారంభిస్తే ఒప్పైతది.. దళితబంధు ప్రారంభిస్తే మాత్రం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆరోజు ఒప్పైంది.. ఈ రోజు కూడా ఒప్పవుతుంది కదా అని పేర్కొన్నారు. ఏ నాయకుడైనా తన నియోజకవర్గంలోని ప్రజలకు మేలు జరుగుతుందంటే ఆహ్వానిస్తారని, వీలైతే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతారన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కో కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని మాట్లాడారని, ఈ విషయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల సాయం అందిస్తున్నామని, చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 40 లక్షలను కేంద్రం నుంచి తెప్పించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకం ప్రారంభం రోజున 15మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామన్నారు. అడ్డంకులు సృష్టించి బీజేపీ వాళ్లు తాత్కాలిక సంతోషం పొందవచ్చు కాని, భవిష్యత్‌లో ఆ కుటుంబాల చేతిలోనే మసైపోతారని పేర్కొన్నారు. పథకం అమలు చేసి తీరాలన్న దృఢ సంకల్పం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.
ఆహ్వానించాలి కదా…
ఇంతమంచి పథకాన్ని బీజేపీ నాయకులు ఆహ్వానించాల్సింది పోయి ఆపాలని ప్రయత్నం చేయడం సమంజసం కాదన్నారు. ‘దళిత బిడ్డలందరికీ నాదొక్కటే విజ్ఞప్తి.. ఈ అపోహలు, పుకార్లను ఎవరూ నమ్మవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. దళితబంధు ఆపాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఉత్తరాలు రాస్తున్నారని, హైకోర్టులో కేసులు వేస్తున్నారని, వీటి వెనుక ఎవరున్నారనేది సామాన్య జనంతో పాటు దళిత జాతి మొత్తం గమనిస్తున్నదనే విషయం తెలుసుకోవాలన్నారు. హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లి దళిత బస్తీలో గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారని, ముఖ్యమంత్రికి అండగా ఉంటామని తీర్మానం చేయడం శుభపరిణామన్నారు. అంతకుముందు దిశ జర్నలిస్టు లక్ష్మణ్‌రావు మృతికి మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. సదరు జర్నలిస్టు కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్ వద్ద ఈ నెల 16న నిర్వహించే సీఎం సభ స్థలాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఐజీ నాగిరెడ్డి, పోలీస్ అధికారులతో వేదిక, సభ వద్ద ప్రజల కోసం చేసే ఏర్పాట్లపై చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.