ఊరూరా రైతుబంధు సంబురాలు
భోగి పండుగ సిరులు తెచ్చిందంటూ ఆనందహేల
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
ఉత్సాహంగా ఎడ్లబండ్ల ర్యాలీలు
రైతుబంధు రంగవల్లులతో మెరిసిన వాకిళ్లు
కాల్వశ్రీరాంపూర్/ ధర్మారం జనవరి14: కర్షకలోకం కదిలింది.. పెట్టుబడి సాయమిచ్చి అండగా నిలిచిన తెలంగాణ సర్కారుకు జైకొట్టింది.. సంక్రాంతి పండుగకు ముందురోజు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా రైతుబంధు సంబురాల్లో మునిగితేలింది. భోగి పండుగ తమకు సిరులు తెచ్చిందంటూ సంబురపడింది. ఎండ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలతో పల్లెపల్లెనా కోలాహలం నెలకొన్నది.. సంక్షేమ పథకాలతో సాగును పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నది. ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్.. అన్నదాత పెన్నిధి వర్ధిల్లాలి’ అనే నినాదాలతో హోరెత్తించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రైతుబంధు సంబురాలు ఉత్సాహం గా నిర్వహించారు. సంక్రాంతి పండుగ ప్రతిబింబించేలా వేడుకలు జరుపుకున్నారు. కర్షకులు ఊరూరా ర్యాలీలు తీశారు.. అలంకరించిన ఏడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించారు. ‘జై రైతుబంధు..జై జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీ పొడుగునా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ముందుకుసాగారు..డప్పు చప్పుళ్ల మధ్య నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. మహిళా రైతులు ముంగిళ్లలో రైతుబంధు ముగ్గులతో అలరించారు.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లిలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతులు తమ అభిమాన నేత.. కర్షక బంధువు సీఎం కేసీఆర్‌తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. కరోనా కష్టకాలంలోనూ పెట్టుబడి సాయం అందించిన తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటామని చెప్పారు. ధర్మారం మండలం రాయయ్యపల్లిలో ఎడ్లబండ్ల ర్యాలీ తీశారు. నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి నేతృత్వంలో గ్రామ కూడలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ‘జై కేసీఆర్..జై కొప్పుల..జై రైతుబంధు’ నినాదాలతో హోరెత్తించారు.