
రామగిరి, డిసెంబర్ 13 : సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని సెంటినరీకాలనీలో ఉన్న రాణిరుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో సోమవారం నుంచి ప్రాంతీయ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఏపీఏ ఏరియా ఇంజినీర్ వై రాజశేఖర్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆర్జీ-3, ఏపీఏ, భూపాలపల్లి జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన కబడ్డీ, బ్యాడ్మింటన్ క్రీడాకారులు కొత్తగూడెం ఏరియాలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న కంపెనీ స్థాయి పోటీలకు, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను ఈ నెల 16, 17 తేదీల్లో ఆర్జీ-3, ఏపీఏ ఏరియాలో నిర్వహించే కంపెనీ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్ రామకృష్ణ, ఏజీఎం టీ హీర్యా, ఏరియా ఎస్టేట్ ఆఫీసర్ కావూరి మారుతి, డీవైపీఎం, కార్మిక సంఘం నాయకులు శ్రీనివాస్, క్రీడా కార్యదర్శి నాగేశ్వరరావు, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, సమన్వయకర్తలు బూస వెంకటేశ్వర్లు, బర్ల నారాయణ, సీనియర్ క్రీడాకారులు ముఖేశ్‌కుమార్, ప్రసాద్, చంద్రపాల్, వీవీ గౌడ్, శేషగిరి, హఫీజుద్దీన్, రెండు ఏరియాల క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా.. మొదటి రోజు కబడ్డీ పోటీల్లో ఆర్జీ-3 ఏపీఏ జట్టు విజయం సాధించగా.. బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో భూపాలపల్లి జట్టు గెలిచింది.
క్రీడల్లో పతకాలు సాధించాలి
రెబ్బెన, డిసెంబర్ 13: ఏరియా క్రీడాకారులు కంపెనీ స్థాయి పోటీల్లో సత్తాచాటి పతకాలు సాధించాలని బెల్లంపల్లి ఏరియా ఎస్వోటూ జీఎం కృష్ణారావు పేర్కొన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి శ్రీ భీమన్న క్రీడా మైదానంలో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నియర్ బై ఏరియా హాకీ క్రీడలు, గోలేటి సీఈఆర్ క్లబ్లో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ నియర్ బై ఏరియా క్రీడలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జీఎం క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులకు యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకొని పతకాలు సాధించాలని ఆకాంక్షిం చారు. ఏరియా ఇంజినీర్ తిరుమల్‌రావు, డీజీఎం (పర్సనల్) రాజేంద్రప్రసాద్, పర్సనల్ మేనేజర్ లక్ష్మణ్‌రావు, డీవైపీఎం తిరుపతి పాల్గొన్నారు.