ఆర్చరీలో రాణిస్తున్న చికీత lతల్లిదండ్రుల ప్రోత్సాహం.. పతకాలే లక్ష్యం..
పట్టుదలతో ముందుకు సాగుతున్న విద్యార్థి
సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 13;చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఆర్చరీ విద్యలో రాణిస్తున్నది సుల్తానాపూర్కు చెందిన చికీత. తండ్రి ప్రోత్సాహం, పట్టుదలతో శిక్షణ తీసుకుంటూ కఠోర సాధన చేస్తున్నది. పతకాలే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నది.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన తానిపర్తి శ్రీలత-శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు చికీత. ఒక కొడుకు ఉన్నారు. చికీత సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. శ్రీనివాసరావు వ్యవసాయం చేసుకుంటూ పిల్లల ఆలోచనలకు అనుగుణంగా వారిని ప్రోత్సహిస్తున్నాడు. చికీతకు ఆర్చరీ అంటే ఇష్టం. ఈ క్రమంలో ఆమెకు కరీంనగర్లోని సీపీపీసీలో స్పోర్ట్స్ కోచ్ డీ శ్రీనివాస్ వద్ద ఆర్చరీలో శిక్షణ ఇప్పించాడు. పట్టుదలతో కఠోర సాధన చేస్తూ పలు పోటీల్లో పాల్గొంటూ చికీత ప్రతిభ చూపుతున్నది. 2019లో ఎస్జీఎఫ్-17 ఆర్చరీలో కాంపౌండ్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. 20 ఫిబ్రవరి 2021న జూనియర్ విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది. 21 ఫిబ్రవరి 2021 అసోసియేషన్ విట్స్లో సబ్ జూనియర్లో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 28 ఫిబ్రవరి 2021 సీనియర్ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో నవంబర్ 21 నుంచి 30 వరకు జరిగిన 38వ సబ్ జూనియర్ జాతీయ విలు విద్య చాంపియన్ షిప్లో, జాతీయ వ్యక్తిగత విభాగంలో వెండి, మిశ్రమ విభాగంలో కాంస్య పతకాలను సాధించింది. పలు పతకాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న చికీత అందరి ప్రశంసలు అందుకుంటున్నది.