కరీంనగర్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ తాజాగా తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31,80,821 ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. ఆ లెక్కన చూస్తే.. గత ఎన్నికకు, ఈ ఎన్నికకు భారీగా పెరుగుదల కనిపిస్తున్నది. 2018తో పోలిస్తే కొత్తగా 3.93 లక్షల పైచిలుకు ఓటర్లు నమోదు కాగా, గతంలో ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య రెండు లక్షలకు మించి ఓటర్లు పెరిగిన దాఖలాలు లేవని స్పష్టమవుతున్నది. ఈసారి కరీంనగర్, రామగుండం మినహా మిగిలిన పదకొండు నియోజకవర్గాల్లో మహిళలే అత్యధికంగా ఉన్నట్టు తేలింది. అయితే, తుది జాబితా రావడం, నామినేషన్ల పరిశీలన ముగియడంతో అంతటా రాజకీయ వేడి కనిపిస్తున్నది.
సాధారణంగా ఐదేళ్లకోసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను చూస్తే.. పూర్వ ఉమ్మడి జిల్లాలో ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్యలో రెండు నుంచి రెండున్నర లక్షల మధ్య మాత్రమే ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పట్లోనూ అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేసినా.. పెరుగుదల అనుకున్నంతగా కనిపించలేదు. కానీ, గత చరిత్రలో లేని విధంగా ఈసారి మాత్రం ఓటరు ప్రంభజనం కొనసాగింది. ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో ఓటర్ల సంఖ్య అత్యధికంగా పెరిగింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల సమయంలో 28,27,556 మంది ఓటర్లు ఉండగా, అదే 2018 నాటికి ఓటర్ల సంఖ్య 27,87,549కు తగ్గింది. ప్రస్తుతం ఎన్నికల వేళ ఓటర్ల సంఖ్య 31,80,821కు చేరింది. అయితే, 2014-18 ఎన్నికలకు మధ్య ఓటర్లు తగ్గడంపై ఆనాడే అధికారులు వివరించారు. అయితే, ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో నాలుగు జిల్లాల కలెక్టర్లు మరింత ప్రత్యేక దృష్టి పెట్టారు. బూత్‌స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించి పలుసార్లు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. అర్హులై ఉండి నమోదు చేసుకొని వారిని గుర్తించి, వారు ఓటు నమోదు చేసుకునేలా చైతన్యం చేశారు. దీంతోనే భారీగా ఓట్లు పెరిగాయని అధికారులు భావిస్తున్నారు.
నెల రోజుల్లో పెరిగిన ఓట్లు 68,538
గత రెండు ఎన్నికలను చూస్తే ఎన్నికకు ఎన్నికకూ మధ్య ఓటర్ల సంఖ్య తగ్గింది. 2014 ఎన్నికల వేళ 28,27,556 మంది ఓటర్లు ఉండగా, అదే 2018 నాటికి ఆ సంఖ్య 27,87,549కి తగ్గింది. అప్పుడు 40,007 మంది ఓట్లు తగ్గాయి. అదే ప్రస్తుతం చూస్తే ఓటర్ల సంఖ్య భారీగానే పెరిగింది. గత అక్టోబర్ 4న ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా విడుదల చేసినప్పుడు 31,12,283 ఓట్లు ఉన్నాయని తేలింది. చివరగా మరో అవకాశం ఇవ్వడంతో చాలా మందే వినియోగించుకున్నారు. కేవలం నెల రోజుల్లోనే 68,538 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ లెక్కన మొత్తం ఓటర్ల సంఖ్య 31,80,821కు చేరగా, గతంతో పోలిస్తే ఈసారి అర్హులు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చినట్టు స్పష్టమవుతున్నది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటరు ప్రంభజనం కనిపించింది. అలాగే, పదొకండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలే పెద్ద సంఖ్యలో ఉన్నారు.