అరుదైన వ్యాధి బారిన గోదావరిఖనికి చెందిన రాజు
చిన్నప్పుడే మరణించిన తల్లి
అన్నీ తానై సాకుతున్న వృద్ధాప్యంలో ఉన్న తండ్రి
శస్త్రచికిత్సకు రూ. 5 లక్షలు అవసరమని చెప్పిన వైద్యులుఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
గోదావరిఖని 33వ డివిజన్ ఫైవింక్లయిన్ కాలనీకి చెందిన దొంత సాయిలు కుమారుడే రాజు. సాయిలు భార్య గతంలోనే చనిపోగా, రాజుతో కలిసి ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నా రు. స్థానికంగా ఒక ప్రైవేటు చిట్ఫండ్ కంపెనీ లో పనిచేసే రాజు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో తండ్రిని పోషించుకుంటున్నాడు. ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వీరి కుటుంబానికి హఠాత్తుగా ఆపద ముందుకొచ్చింది. రాజుకు బీపీ పెరగడంతో పక్షవాతం వచ్చి చేతులు, కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమయ్యాడు. రాజు మిత్రులు,స్థానికుల సాయంతో అప్పటికప్పుడు చికిత్స చేయించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చూపించగా టీఎంఎస్ థెరపీ చేస్తే వ్యాధి నయమవుతుందని, కానీ, అందుకు రూ.5 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు.
అండగా నిలుస్తున్న మిత్రులు
రాజు మిత్రులు కాగితపు చంద్రశేఖర్, మద్దెల దినేశ్తోపాటు మరికొందరు ఇప్పటికి రాజును కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు. ఆపదలో ఉన్న మిత్రుడి పరిస్థితిని చూసి చలించిన వారు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా ఇంటికి వెళ్లి రాజుకు ధైర్యం చెప్పడమే గాకుండా చేతనైన చిన్న సాయం చేస్తున్నారు. మూడేళ్లుగా తండ్రీకొడుకులు ఆకలికి అల్లాడకుండా దగ్గరుండి చూసుకుంటూ స్నేహితులుగా నిరూపించుకుంటున్నారు. కానీ, తమ మిత్రుడు రాజు అందరిలాగే లేచి నడవాలంటే ఆపరేషన్ జరగాలనీ, అందుకు దాతలు ముందుకొచ్చి చేతనైనా సాయం అందిస్తే పునర్జన్మ ప్రసాదించిన వారవుతారని వేడుకుంటున్నారు.