ధర్నాతో తొలి అడుగు వేసినం
అన్నదాతల వెన్నంటె ఉంటున్నం
రైతు వేదికలే మా ఉద్యమ కేంద్రాలు
ఢిల్లీలో వడ్లు కొనేది లేదంటే.. గల్లీలో సిల్లీ ఫెల్లోస్ వరి వేయాలంటున్నరు
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, నవంబర్ 12 :రైతులను కష్ట పెడితే ఊరుకోం. సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వారి వెన్నంటి ఉంటుంది. యాసంగి వడ్లు కొంటామని కేంద్రం చెప్పేదాక కొట్లాడుతం. కేంద్రంలోని బీజేపీ తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలను అడుగడుగునా ఎండగడుతం. ధర్నాతో తొలి అడుగు వేసినం. ఇక నుంచి రైతు వేదికలే మా ఉద్యమ కేంద్రాలుగా మార్చుకుని పోరాడుతం. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఓ వైపు యాసంగి ధాన్యం కొనబోమని చెబుతుంటే.. గల్లీలోని సిల్లీ ఫెల్లోస్ మరొకటి మాట్లాడుతున్నరు. అవగాహన లేని బండి సంజయ్ వరి వేయాలని ఎట్ల చెబుతున్నడు. సరైన సాగు భూమి ఉన్నా.. వేల టీఎంసీల నీటి లభ్యత కలిగిన జీవ నదులున్నా. ఆకలి రాజ్యాల ర్యాంకుల్లో దేశం ఉండడం బీజేపీ పాపమే.
యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు కొట్లాడుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం బైపాస్‌రోడ్డులోని మైదానంలో శుక్రవారం నిర్వహించిన రైతుల మహాధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మంత్రి కేటీఆర్ సారథ్యం వహించిన ధర్నాలో సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల నుంచి వేల సంఖ్యలో రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు డప్పు చప్పుళ్లతో ర్యాలీగా సిరిసిల్లకు చేరుకున్నారు. 11 గంటలకు మొదలైన ధర్నా ఒంటి గంట వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రైతులనుద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రైతులకు అండగా ఉంటారని చెప్పారు. నాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో చేసిన పోరాటం రైతు ధర్నాతో మరోసారి గుర్తుకు వస్తుందన్నారు. ఏడున్నరేండ్లలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి, రైతులకు పెద్దపీట వేశారన్నారు. 75 ఏండ్ల గత పాలకుల రైతు వ్యతిరేక విధానాలకు స్వస్థి పలికి అన్నదాతకు మద్దతుగా కొత్త చరిత్ర సృష్టించారని చెప్పారు. ఒకప్పుడు దేశంలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయని, తెలంగాణ ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన రైతు సంక్షేమ పథకాలతో ఆత్మహత్యలు తక్కువయ్యాయని, దీనిని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఉమ్మడి కాలంలో విత్తనాలు, యూరియా కోసం రైతుల మధ్య యుద్ధాలు జరిగేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని రూపుమాపి అన్నదాత సంతోషంగా ఉండేలా కృషి చేసిందన్నారు. చెరువులు, కుంటలను రూ.20 వేల కోట్లు వెచ్చించి మిషన్ కాకతీయతో మరమ్మతులు చేయించి ఇటు రైతులకు, అటు కులవృత్తులకు జీవం పోసిందన్నారు. కాకతీయుల గొలుసుకట్టు చెరువుల పూర్వ వైభవాన్ని చూపించిందన్నారు. పల్లె జీవితాలు బాగుపడ్డాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతమైన సిరిసిల్లకు కాళేశ్వర జలాలు వచ్చాయని, మండుటెండల్లోనూ మానేరు మత్తడి దుంకడం చరిత్ర సృష్టించిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, మల్టీస్టేట్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత కేసీఆర్‌దే అని స్పష్టం చేశారు. గోదావరి జలాలను ఎగువకు మళ్లించి బీడు భూములను సస్యశ్యామలం చేసినట్లు తెలిపారు. సస్యవిప్లవంలో పంజాబ్‌కు పోటీపడి ధాన్యం పండిస్తుందని గుర్తుచేశారు. దేశానికే బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిందన్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సైతం వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు.
ఆకలిరాజ్యాల్లో దేశం.. బీజేపీ పాపమే
ఆకలిరాజ్యాల్లో మన దేశం కూడా ఉండడం కేంద్రంలోని బీజేపీ చేసిన పాపమేనని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘అన్నీ అమ్మేస్తాం.. కానీ, వడ్లు కొనం అంటూ కేంద్రం అహంకారపూరిత పాలనతో అన్నదాతను కేంద్రం అతలాకుతలం చేస్తున్నది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐరోపాకు చెందిన గ్లోబల్ అంగర్ ఇండెక్స్ అనే సంస్థ ఆకలి ఎక్కువగా ఉన్న దేశాలపై సర్వే చేపట్టి 116 దేశాలకు సంబంధించిన ర్యాంకులను గత అక్టోబర్‌లో ప్రకటించిందని, అందులో మన దేశం 101వ స్థానంలో ఉండడం సిగ్గుచేటన్నారు. 92వ స్థానంలో పాకిస్థాన్, 76వ స్థానంలో నేపాల్, బంగ్లాదేశ్ ఉన్నాయన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగుకు సవ్యంగా ఉండగా, 65వేల టీఎంసీల నీటి లభ్యతగల బ్రహ్మపుత్ర, గంగ, యమున, గోదావరి వంటి జీవనదులున్నా సగం వరకు కూడా పంటలను సాగుచేయలేని దుస్థితిలో దేశం ఉందన్నారు. సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉన్నప్పటికీ ప్రోత్సహించే ప్రభుత్వాలు లేకపోవడంతో ఆకలిరాజ్యంలో చోటు దక్కించుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ దివాళాకోరు విధానాలతో బీజేపీ దుష్టపరిపాలనతో ఆకలిరాజ్యంలో చోటుదక్కడం బాధాకరమన్నారు. దేశంలో తెలంగాణ చేసిన పని అన్ని రాష్ర్టాల్లో చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఆహార భద్రత కల్పించే బాధ్యత కేంద్రంపై ఉంటుందన్న అంశాన్ని విస్మరించడం వల్లనే అన్నదాతకు నష్టం కలుగుతుందన్నారు. ధాన్యం సేకరణ బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందన్నారు. ఆరేళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిందని, ప్రస్తుతం కేంద్రం యాసంగి పంటను కొనలేమని చెప్పడంతోనే ఉద్యమించాల్సి వచ్చిందన్నారు. యాసంగి పంట కొనలేమని పంచాయితీ పెట్టడం ఆహార భద్రతను విస్మరించినట్లేనన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రానికి లోబడి రాష్ర్టాలు పనిచేస్తున్నాయని, ఇదే అంశమై సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని, నిల్వలకు గోదాంలు సరిపోవని విన్నవించినట్లు తెలిపారు. కేంద్రం ససేమిరా అనడంతో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు పండించాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని వివరించారు. ముస్తాబాద్ మండలం మోహినికుంట రైతులు ఆర్బీస్ మండలాధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు ఆధ్వర్యంలో దాదాపు 200ల ఎకరాల్లో పొద్దు తిరుగుడు సాగు చేయాలని తొలి అడుగు వేశారని గుర్తుచేశారు. కేంద్రం వరి కొంటామంటే తాము వద్దంటామా? అని, ఎప్పటిలాగే వరి కొనుగోళ్లు చేసి రైతుల కష్టాలను తీర్చే వరకు పోరాడుతామని స్పష్టంచేశారు.
ఓట్ల కోసం తొండి సంజయ్ ఆరాటం
కేంద్ర ప్రభుత్వం ఓ వైపు వరిధాన్యం కొనమని చెబుతున్నా అవగాహన లేని బండి సంజయ్ వరి వేయాలని ఎలా చెబుతున్నాడని ప్రశ్నించారు. ఢిల్లీలో ఒకటి చెబుతుంటే గల్లీలో సిల్లీ ఫెల్లోస్ మరొకటి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులను నష్టాల్లోకి దింపితే ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరుకోదన్నారు. పార్లమెంట్ సభ్యుడు అయినప్పటి నుంచి బండి సంజయ్ సిరిసిల్లకు ఒక్క పైసా తీసుకొచ్చిండా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లుగా విమర్శలు చేస్తే సహించామని, ఇక రైతులను కష్టపెట్టాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. బండి సంజయ్ అవగాహన లేక పాకిస్థాన్ ఇండియా అంటూ ఓట్ల కోసం చిల్లర మల్లర రాజకీయాలు చేయడం తగదన్నారు. ఓట్ల కోసం తొండీలు మాట్లాడడం బండికి సరికాదని హితవుపలికారు.
రైతు తిరగబడితే ఎడ్లబండి కింద బీజేపీ నలిగిపోతది
ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర మంత్రి కొడుకు రైతులను కార్లతో తొక్కించి ప్రాణాలు తీశాడని, దానిపై ప్రధానమంత్రి కనీసం సంతాపం ప్రకటించలేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అదే రైతు తిరగబడితే ఎడ్లబండి కింద బీజేపీ నలిగిపోతుందని హెచ్చరించారు. ఓట్ల కోసం బీజేపీ రైతులతో చలిమంటలు కాచుకుంటుందని, నల్లచట్టాలకు వ్యతిరేకంగా కేంద్రంపై పలురాష్ర్టాలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ధర్నాలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, బొల్లి రాంమోహన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతుబంధు సమితి కన్వీనర్లు, రైతులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.