డ్రైనేజీల క్లీనింగ్‌లో ఉత్తమ పనితీరుకు గుర్తింపు
వరించిన జాతీయస్థాయి పురస్కారం
ఈ నెల 20న ఢిల్లీలో ప్రదానం
అందరి సహకారంతోనే సాధ్యమైంది: మేయర్ వై సునీల్‌రావు
కార్పొరేషన్, నవంబర్ 12;కరీంనగర్ నగర పాలక సంస్థకు జాతీయ ఖ్యాతి దక్కింది. మనుషులను వినియోగించకుండా పూర్తిగా యంత్రాలతోనే భూగర్భడ్రైనేజీల శుభ్రం చేయించినందుకుగాను ‘సఫాయిమిత్ర’ పురస్కారం వరించింది. సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్‌లో భాగంగా దేశంలో 98 మున్సిపాలిటీలు పోటీపడ్డా కన్నారానికే దక్కింది. ఈ నెల 20న ఢిల్లీలో పురస్కారాలు ప్రదానం చేయనుండగా, మేయర్ సునీల్‌రావు సహా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరి సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు.
ఈ చాలెంజ్‌లో నగరాలు, పట్టణాల పరిధిలో మానవ వ్యర్థాలను పూర్తిగా యంత్రాల సహాయంతోనే చేపట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు తీసుకునే చర్యల ఆధారంగా ఉత్తమ పనితీరు చూపిన నగరాలు, పట్టణాలను ఎంపిక చేసి వాటికి నగదు ప్రోత్సాహకాలను అందిస్తుంది. పోటీ కోసం 10 లక్షలకు పైగా జనాభా ఉన్న మున్సిపాలిటీలు, 10 లక్షల లోపు.., 3 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాలను మూడు కేటగిరీలుగా విభజించించింది. ఆయా విభాగాల్లో మొదటి మూడు పట్టణాలను ఎంపిక చేస్తారు. మొదటి ప్రథమ స్థానంలో నిలిచిన పట్టణానికి రూ.8 కోట్లు, ద్వితీయ రూ.4 కోట్లు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.2.50 కోట్లు అందిస్తారు. అయితే 3 లక్షల లోపు జనాభా కేటగిరీలో ఉన్న కరీంనగర్ దేశంలోని 98 మున్సిపాలిటీతో పోటీపడి, ఉత్తమ ప్రతిభచూపి, అవార్డుకు ఎంపికైంది. అయితే ఎన్నో ర్యాంకులో నిలిచిందనే మాత్రం చెప్పలేదు. ఈ నెల 20 ఢిల్లీలో ర్యాంకు ప్రకటించడంతో పాటుగా అవార్డులను అందించనున్నారు. దీంతో నగరపాలక సంస్థలో హర్షం వ్యక్తమైంది. ఈ సంతోషాన్ని కమిషనర్ యాదగిరిరావు పారిశుధ్య విభాగం అధికారులు, కార్మికులతో కలిసి స్వీట్లు పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు.
పకడ్బందీ కార్యాచరణతోనే అవార్డు
సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్ కోసం కరీంనగర్ బల్దియా ఆది నుంచి పక్కా ప్రణాళికతో ముందుకుసాగింది. ఇప్పటికే మానవ వ్యర్థాల శుద్ధీకరణకు ఎస్టీపీ ఉండడంతో పని సులువైంది. ముందుగా నగరంలో సెప్టిక్ క్లీనింగ్ యజమాన్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు. సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ఎక్కడ పడవేయకుండా ట్రీట్మెంట్ ప్లాంట్‌లోనే వేయాలని ఆదేశించారు. అనంతరం నగరపాలక సంస్థ నుంచి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ యంత్రాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 14420 టోల్ ఫ్రీ నంబర్‌ను కేటాయించి విస్తృత ప్రచారం చేశారు. ఈ నంబర్‌కు వచ్చే కాల్స్ ఆధారంగా క్లీనింగ్ యజమాన్యులకు సమాచారం ఇచ్చి యంత్రాలతోనే క్లీనింగ్ చేయించారు. సెప్టిక్ ట్యాంకులను మూడేళ్లకోసారి శుభ్రం చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. నగరంలోని సెప్టిక్ ట్యాంకులను జియోట్యాగింగ్ చేయించారు. పలువురికి సబ్సిడీపై క్లీనింగ్ యంత్రాలను మంజూరు చేయించారు. ఇదేగాక భూగర్భ డ్రైనేజీలను క్లీనింగ్ చేయించేందుకు జట్టి వంటి ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. దీంతో జాతీయ స్థాయిలోనే కరీంనగర్ నగరపాలక సంస్థ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.