అభివృద్ధి ఆగిపోతుంది
కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీకి ఇక్కడ చోటులేదు
పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టండి
మంత్రి కొప్పుల ఈశ్వర్
కమ్యూనిటీ హాల్, ఆలయ నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున మంజూరు పత్రాల అందజేత
జమ్మికుంట, సెప్టెంబర్ 12: కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి ఓటేస్తే భవిష్యత్తు అంధకారమేనని, అభివృద్ధి ఆగిపోతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ పార్టీకి ఇక్కడ చోటు లేదని, టీఆర్ఎస్ను గెలిపించుకుంటేనే అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో ముచ్చటించారు. తర్వాత కేశవాపూర్‌లో కనుకదుర్గమ్మ గుడి నిర్మాణం కోసం రూ.10లక్షలు, పూసవెర్ల కులస్తుల కమ్యూనిటీ హాల్ కోసం రూ.10లక్షల మంజూరు పత్రాలను ఆయా సంఘాల నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా అమాత్యుడు మాట్లాడారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి ఇక్కడ స్థానం లేకుండా చేయాలని పేర్కొన్నారు.
లెఫ్ట్ భావాలున్నా ఈటల, మతతత్వ పార్టీలోకి ఎందుకు వెళ్లాడో.. చెప్పాలని డిమాండ్ చేశారు. తన సొంత ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నాడని, ఆత్మ గౌరవమంటూ నాటకాలాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడియారాలు, గొడుగులు పంచడమేనా..? ఆత్మ గౌరవమంటే అని ప్రశ్నించారు. మంత్రిగా పనిచేసిన ఈటల, ఇక్కడ అభివృద్ధిని చేయలేదని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఇక్కడి ప్రజలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, ఇప్పటికే రూ.50కోట్ల నిధులు అభివృద్ధి కోసం అందించారని తెలిపారు. ప్రతి సంఘానికి కమ్యూనిటీ హాల్స్, గుడులు, బడులు, ఎన్నో కట్టించుకుంటున్నామని, ఎన్నికల్లోపు పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. ఉప ఎన్నికల్లో గరీబు బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే ఓటేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నల్ల చట్టాలను రూపొందించిన బీజేపీని ఓటుతో ఓడించాలని ఎమ్మెల్యే చందర్ పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు రమేశ్, భాస్కర్, నాయకులు ఉన్నారు.
మంత్రి కొప్పుల ప్రత్యేక పూజలు
జమ్మికుంట చౌరస్తా, సెప్టెంబర్ 12: పట్టణంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అలాగే 16వ వార్డులో ఉన్న పురాతన సీఎస్ఐ చర్చిని సందర్శించి ప్రార్థనలు నిర్వహించారు. చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.26 లక్షలు మంజూరు చేసి అనుమతి పత్రాన్ని అందించారు. 27వ వార్డు కృష్ణకాలనీలో రూ.43 లక్షలను మంజూరు చేశారు. ఇందులో అంగన్వాడీ భవనానికి రూ.15 లక్షలు, యూత్ బిల్డింగ్‌కు రూ.10 లక్షలు, పోచమ్మ ఆలయానికి రూ.10 లక్షలు, చర్చి అభివృద్ధికి రూ.8లక్షల మంజూరు పత్రాలను అందించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో చేరికలు
జమ్మికుంట, సెప్టెంబర్ 12: మున్సిపల్ పరిధిలోని ఒడ్డెర కాలనీకి చెందిన 20మంది బీజేపీ నాయకులు ఆదివారం రాత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పిన మంత్రి కొప్పుల పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు రాజ్‌కుమార్ తదితరులున్నారు.