సంఘాలకు పక్కాభవనం.. మహిళలకు ఆత్మగౌరవం
హుజూరాబాద్‌లో 20 గుంటల్లో రూ.కోటితో నిర్మాణం
శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు
మండలంలోని 16 గ్రామాలకు గ్రామైక్య భవనాలు
ఒక్కో భవనానికి రూ.20 లక్షలు మంజూరు
రూ.20 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాల పంపిణీ
కరీంనగర్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ);“హుజూరాబాద్ నియోజకవర్గంలో మహిళా సంఘ భవనాలు ఎక్కడ ఉన్నయ్? ఒక్కటి కూడా ఎందుకు కనిపిస్తలేవు? సిద్దిపేట జిల్లాలోని ప్రతి ఊరిలో ఉన్నయ్.. పక్కన హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఉన్నయ్.. ఇంకా అన్ని చోట్లా కట్టించాం.. ఇక్కడ ఇన్నాళ్లూ ఈటల రాజేందర్ ఏం చేశాడు..” అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై ధ్వజమెత్తారు. ఇపుడు ఈ బాధ్యతను తాము తీసుకుంటున్నామన్న ఆయన, హుజూరాబాద్‌లో 20 గుంటలలో రూ.కోటి వెచ్చించి పట్టణ సమాఖ్య భవనాన్ని నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం హుజూరాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి కింద రుణాల పంపిణీ కార్యక్రమంలో మరో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భగా మహిళలతో కలిసి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతకు ముందు సీఎం సభ కోసం మంత్రులు కొప్పుల, గంగులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఎన్నో ఏండ్లుగా చెట్ల కింద కూర్చుని సమావేశాలు నిర్వహించుకుంటున్న మహిళా సంఘాలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తీపి కబురు వినిపించారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన ఆయన, హుజూరాబాద్‌లో రూ.కోటితో మహిళా సమైక్య భవనాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తపల్లి, ఇందిరానగర్ సమీపంలో మహిళా సంఘ భవనానికి కేటాయించిన 20 గుంటల స్థలంలో భూమి పూజ చేశారు. హుజూరాబాద్ మండలంలో16 గ్రామాల్లో గ్రామైక్య సంఘ భవనాలు నిర్మించేందుకు రూ.3.10 కోట్లు మంజూరు చేసినట్లు మహిళల హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. ఈ విషయమై హుజూరాబాద్ పట్టణ మహిళ సమాఖ్య మహిళలు మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ సమావేశాలు మున్సిపల్ కార్యాలయంలో చెట్ల కింద నిర్వహించుకుంటున్నామని, ఇప్పుడు పక్కా భవనం నిర్మిస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒక్కో సంఘ భవనానికి రూ.20 లక్షలు కేటాయించడంతో ఇటు హుజూరాబాద్ మండల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వడ్డీ లేని రుణాలు మంజూరు కావడంతో ఆనందంలో మునిగితేలారు.
హుజూరాబాద్‌కు రూ.1.90 కోట్ల వడ్డీ లేని రుణాలు
గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలకు మాత్రమే వడ్డీ లేని రుణాలు మంజూరైనట్లు హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక మంత్రి హరీశ్‌రావు దృష్టికి తేగానే పట్టణ సంఘాలకు గురువారం సాయంత్రం వరకు రూ.1.90 కోట్లు విడుదల చేయిస్తానని వేదికపై హామీ ఇచ్చిరు. మండల సమాఖ్యకు సంబంధించిన రూ.19.73 కోట్ల చెక్కును సంబంధిత మహిళా ప్రతినిధులకు అందించారు.
ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజు
మా సంఘాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజు ఇది. మా మండలంలో 16 సంఘాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు రూ.3.10 కోట్లు మంజూరు చేశారు. చాలా సంతోషంగా ఉంది. మాకు రావాల్సిన వడ్డీ లేని రుణాలు రూ. 19.73 కోట్ల ఇచ్చారు. ఇది చాలా మంచి విషయం. మూడేళ్లుగా వీటి కోసం ఎదురు చూస్తున్నాం. మా సంఘాల్లోని ప్రతి మహిళా సభ్యురాలు సంతోషంగా ఉన్నరు.
ఆనందంగా ఉంది
మాకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, సొంత భవనాలకు నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. సొంత భవనాలు లేక సమావేశాలు ఎక్కడ నిర్వహించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు సొంత భవనాలు వస్తున్నాయంటే చాలా మంది మహిళలు సంతోషంగా ఉన్నరు. సీఎం కేసీఆర్ సార్‌కు, మంత్రి హరీశ్‌రావు సార్‌కు ధన్యవాదాలు.
హరీశ్‌రావుపై నమ్మకం ఉంది
హుజూరాబాద్ పట్టణంలో 554 స్వశక్తి సంఘాలు, 24 సమాఖ్యలు ఉన్నాయి. ఇందులో 6,080 మంది సభ్యులు ఉన్నారు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్‌కు ఇప్పటి వరకు సొంత భవనం లేదు. అనేక సార్లు ప్రయత్నాలు చేశాం. కానీ, మా గోడు వినేవాళ్లు లేకుండిరి. సొంత భవనం లేక మున్సిపల్ ఆఫీసులోని ఒక వరండాలోనో, చెట్ల కిందనో మీటింగులు పెట్టుకునెటోళ్లం. ఎంత ఇబ్బందికర పరిస్థితి అంటే చెప్పరాని బాధలు అనుభవించాం. ఇప్పుడు హరీశ్‌రావు చొరవతో మాకు సొంత భవనం వచ్చేస్తోంది. పట్టణంలో 20 గుంటల స్థలాన్ని ఇచ్చారు. రూ.కోటి మంజూరు చేసి రూ.50 లక్షలు విడుదల చేశారు. త్వరలో పనులు ప్రారంభించుకుంటాం. మంత్రి హరీశ్‌రావు ఈ పని పూర్తి చేయిస్తారనే నమ్మకం ఉంది.