రంగంలోకి 12 రాష్ట్ర స్థాయి విజిలెన్స్ స్కాడ్ బృందాలు
ఇప్పటికే తనిఖీలు చేస్తున్న పోలీసులు
అన్నీ తెలిసినా అసోసియేషన్లు మౌనం
దందారాయుళ్లలో గుబులు
కరీంనగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాపై కూపీ లాగుతున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు.. వివిధ విభాగాల అధికారులు ఇప్పటికే తనిఖీలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖకు చెందిన 12 విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న దందాపై ఆరా తీస్తున్నాయి. ఇదే సమయంలో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న మిల్లర్ల ఆట కట్టించేందుకు అధికారులు, పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కొంత మంది మిల్లర్ల ఈ దందాలో ఆరితేరినట్లుగా గుర్తించి, పీడీయాక్టు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్రమార్కులు ఎంతటి వారైనాసరే విడిచిపెట్ట వద్దని మంత్రి ఆదేశించగా, దందారాయుళ్లలో గుబులు పుడుతున్నది.
పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాపై రాష్ట్ర సర్కారు నజర్ పెట్టింది. అక్రమార్కుల తాట తీసేందుకు చర్యలకు సిద్ధమవుతున్నది. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సీరియస్గా ఉన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వగా, ఇప్పటికే పోలీసులు కూపీ లాగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు చెందిన 12 విజిలెన్స్ స్కాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, పౌరసరఫరాల శాఖతోపాటు దీనికి అనుసంధానంగా ఉండే అన్ని శాఖలు కలిసి పనిచేయాలని, అక్రమార్కులు ఎంతటి వారైనా విడిచి పెట్టవద్దని, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఇప్పటికే రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి.. నాలుగు రోజుల్లో మంచి ఫలితాలను సాధించారు. అంతేకాదు, ఆది నుంచీ బియ్యం రీసైక్లింగ్ దందాలో పాలుపంచుకున్న వారికి ఈ నెల 10న కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక్కడితో ఆగకుండా.. సదరు వ్యక్తుల నుంచి సమాచారం సేకరించిన మేరకు కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రం నుంచి వచ్చిన విజిలెన్స్ బృందాలతో కలిసి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
దందా ఇలా
ఉమ్మడి జిల్లాలోని పలు కేంద్రాల్లో దందా సాగుతున్నట్లు గమనించిన విజిలెన్స్, పోలీసు బృందాలు.. సదరు మిల్లర్ల వివరాలను సేకరిస్తున్నారు. సదరు మిల్లర్లు.. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పీడీఎస్ బియ్యాన్ని సేకరించి ముందుగా ఒకచోట జమ చేయడం.. అక్కడి నుంచి మరోచోటికి ఆటోల్లో తరలించడం.. అక్కడి నుంచి నేరుగా లారీల్లో తమ మిల్లులకు చేర్చుతున్నట్లు గుర్తించారు. ఈ దందాలో ఎనిమిది మిల్లులకు సంబంధించిన నిర్వాహకులు కీలక భూమిక పోషిస్తున్నట్లుగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు.. సదరు మిల్లర్లు ఇప్పటివరకు కొన్నదెంత? వారు ఈ బియ్యాన్ని ఎలా రీసైక్లింగ్ చేస్తున్నారు? మార్కెట్లో ఎలా విక్రయిస్తున్నారు? వీటిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పెడుతున్నారా? లేక మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారా? అన్న వివరాలు లాగుతున్నారు. అంతేకాదు, ఇప్పటివరకు గుర్తించిన మిల్లుల యజమానులపై ఏమైనా కేసులు నమోదయ్యాయా? పీడీఎస్ బియ్యం తరలింపులో పట్టుబడ్డారా? పట్టుబడితే ఆ కేసులు ఏమయ్యాయి? ఎందుకు సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోకుండా పెండింగ్లో పెట్టారు? ఇలా సమాచారాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తున్నట్లు తెలుస్తున్నది. అలాగే ఇటీవల సన్న వడ్ల కేటాయింపులోనూ కొన్ని అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తున్నది. ఒక అధికారి ఈ దందా నడిపే వారికి పూర్తిగా సహకరించారని, అందులో భాగంగానే.. ఒక మిల్లుకు కేటాయించిన సన్న వడ్లను మరో మిల్లులకు కేటాయించారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ కోణంలోనూ రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందం ఆరా తీస్తున్నది.
తెలిసినా మౌనం?
నిజానికి ఈ దందాను నడుపుతున్నదెవరు? అందులో కీలక సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? అన్న విషయాలు అన్ని జిల్లాల రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులు, సభ్యులకు తెలుసు. అంతేకాదు, ఈ దందా వల్ల యావత్ మిల్లర్ల వ్యవస్థ బద్నాం అయిందని తెలిసినా.. సదరు నాయకులు మాత్రం ఈ విషయంలో నోరు విప్పడం లేదని తెలుస్తున్నది. ఎందుకంటే.. ఎవరు నోరు విప్పితే వారిని ఎక్కడ ఇరికిస్తారోనన్న భయం సదరు అసోసియేషన్ నాయకుల్లో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ కోణంలో పోలీసులు అత్యంత లోతుగా సమాచారం సేకరిస్తున్నారు. అందులో భాగంగానే బలమైన ఆధారాలు సేకరించి, సదరు మిల్లర్ల దందాపై పీడీ యాక్టు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. అయితే అక్రమార్కులు మాత్రం.. తమ దందా కొనసాగింపునకు, కేసులు కాకుండా ఉండేందుకు రకరకాలుగా తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, పీడీఎస్ బియ్యా న్ని రీసైక్లింగ్ చేస్తున్న సదరు మిల్లర్లపై త్వరలోనే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామంటూ పోలీస్ కమిషనర్ చెప్పడం ప్రస్తుతం మిల్లర్లలో గుబులురేపుతున్నది. ఎక్కడ చూసినా జోరు గా ఈవిషయంపై చర్చ సాగుతున్నది.