భూగర్భ డ్రైనేజీ పనులకు మరిన్ని నిధులు
రూ. 40 కోట్లు మంజూరు
త్వరలోనే పనుల ప్రారంభం
కార్పొరేషన్, జనవరి 12: కరీంనగర్లో ప్రస్తుతం పలు డివిజన్లలో వినియోగంలో ఉన్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మరిన్ని డివిజన్లకు విస్తరించేలా నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేయగా, పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం మరింత మెరుగు పడే అవకాశం ఉంది.
నూతనంగా 23 వేలకు ఇళ్లకు కనెక్షన్
ప్రస్తుతం నగరంలోని 5 నుంచి 8 డివిజన్ల వరకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. వాటి పరిధిలోని ఇంటింటికీ భూగర్భ డ్రైనేజీకి కనెక్షన్లు ఇచ్చారు. వాటి ద్వారా వస్తున్న నీటిని బొమ్మకల్లోని ఎస్టీపీ (స్లాడ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో శుద్ధి చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం మరో 23 వేల ఇళ్లకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను విస్తరించనున్నారు. నూతనంగా ఇన్స్పెక్షన్ చాంబర్స్ నిర్మించి ప్రతి ఇంటికీ కనెక్షన్ అందించనున్నారు. దీనికి సంబంధించిన పనులకు రూ. 40 కోట్ల నిధులు కూడా మంజూరు కాగా, త్వరలోనే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ చాంబర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా రోడ్లను తవ్వాల్సి ఉంటుంది. కాగా, ఈ తవ్వకాలు చేపట్టిన ప్రాంతాల్లో తిరిగి మరమ్మతులతో పాటు మూడు ఇంచులతో రోడ్డు వేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీని వల్ల నూతనంగా వేసిన రోడ్లు ధ్వంసం కాకుండా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయితే మరుగుదొడ్లు, టాయిలెట్స్ నుంచి వచ్చే నీరు సాఫీగా వెళ్లిపోతుంది. దీంతో సైడ్స్లో ఉన్న మురుగుకాల్వల్లోకి వచ్చే నీరు కూడా తగ్గి ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.