ప్రజల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
రాజిరెడ్డి స్మారక భవన్లో సీపీఐ మండల కార్యకర్తల సమావేశం
చిగురుమామిడి, డిసెంబర్ 11: ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు, సీపీఐ శ్రేణులు ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ముసు రాజిరెడ్డి స్మారక భవన్లో సీపీఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కౌన్సిల్ సభ్యుడు తేరాల సత్యనారాయణ అధ్యక్షతన శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజల హకులను హరిస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నదని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు దూరం చేస్తూ, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన సీపీఐ 97వ వార్షికోత్సవం డిసెంబర్ 26న అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, రాష్ట్ర సమితి సభ్యులు అందె స్వామి, బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి, తేరాల సత్యనారాయణ, బూడిద సదాశివ, సీతారాంపూర్ సర్పంచ్ గోలి బాపురెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, మాజీ జడ్పీటీసీ ఆలేటి రాజిరెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు.