శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశ్
శ్రీచైతన్య కళాశాలలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 11: సాఫ్ట్‌బాల్ పోటీల్లో క్రీడాకారులు తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించేలా ఎదగాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశ్ ఆకాంక్షించారు. శనివారం మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి బాలుర సాఫ్ట్‌బాల్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సాఫ్ట్‌బాల్ క్రీడతో మేథోశక్తి పెంపొందుతుందన్నారు. క్రీడా కోటాలో అనేక ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. సాఫ్ట్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీలను జిల్లాలో నిర్వహించడంపై జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. విద్యార్థులకు వసతి కల్పించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ రమేశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ శోభన్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా బాధ్యులు అంతడ్పుల శ్రీనివాస్, జనార్దన్‌రావు, వివిధ క్రీడా ప్రతినిథులు, క్రీడాకారులు పాల్గొన్నారు.