రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాజన్నసిరిసిల్ల జిల్లాలో వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి.. జిల్లాలోని 13 మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో మార్కెటింగ్ అధికారులు 255 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని తెచ్చినట్టే కొంటూ వేగంగా మిల్లులకు తరలిస్తున్నారు. వారంలోగా అన్నదాతల ఖాతాల్లో ధాన్యం నగదును జమచేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ జిల్లాలో 3. 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని నిర్దేశిం చింది. ఇప్పటి వరకు మూడింట రెండోంతుల మేర సుమారు రూ. 406 కోట్ల విలువైన 2.16లక్షల టన్నులను కొనుగోలు చేశారు. 36,231 మంది రైతులు విక్రయించగా, 22,102 మందికి రూ. 245.56 కోట్లు చెల్లించారు. మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అందుబాటులో వాహనాలు..
గతంలో వడ్ల కొనుగోలు కన్నా మిల్లులకు తరలింపులోనే ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యేవి. సెంటర్లలో వడ్ల రాశులు పేరుకుపోయేవి. రైతులు పడిగాపులు పడాల్సివచ్చేది. పోలీసుల సహకారంతో రోడ్డున పోయే వాహనాలను ఆపి కేంద్రాలకు తరలించేవారు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ముందస్తుగానే వాహనాల యజమానులతో ఒప్పందం చేసుకున్నది. దీంతో కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని తరలిస్తున్నారు. అలాగే అవసరం మేరకు గన్నీ సంచులను సిద్ధంగా ఉంచారు. సరిపడా సిబ్బందిని నియమించారు. హమాలీల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ చర్యలతో రైతులు ఆనందంగా ఉన్నారు.
పైసలు వెంటనే పడ్డయ్..
మాఊళ్లనే సెంటర్ ఏర్పాటు చేసిండ్రు. వడ్ల కొనుగోలుకు ముందే టోకెన్ ఇచ్చిన్రు. మొదలు 110 బస్తాలు అమ్మిన. వాటి పైసలు బ్యాంకులో జమ అయినయ్. ఇంకా కొన్ని బస్తాల పైసలు రావాలి. మాకు దగ్గర్లోనే సెంటర్ ఏర్పాటు చేసినందుకు ట్రాక్టర్ ఖర్చులు ఎక్కువ కాలేదు. వానకాలం పంటకు ఢోకాలేదు. యాసంగి ఎట్లా అన్నదే రందిపట్టుకున్నది.
-ఎడ్ల కూశాలు, రైతు తిమ్మాపూర్, చందుర్తి మండలం
వాహనాలకు ఇబ్బందిలేదు..
జిల్లాలో 255 కేంద్రాల ద్వారా 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్నది లక్ష్యం. ఇప్పటికే 2.16 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం. 22,102 మంది రైతుల ఖాతాల్లో నగదు జమచేసినం. మరో రూ. కోటి ఆన్లైన్లో చేర్చినం. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తున్నం. సరిపడా వాహనాలు సమకూర్చాం.