ఎక్కడా నిర్లక్ష్యం వద్దు
కొవిడ్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ
కలెక్టర్ కర్ణన్
ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశం
కరీంనగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనందున కోడ్‌ను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, జడ్పీ సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఎలక్టోరల్ రోల్స్ సిద్ధం చేయాలని సూచించారు. ఈనెల 12న ఉదయం 10 గంటల్లోపు ఓటర్ల జాబితా ఇవ్వాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు హకు కలిగి ఉంటారని, వారి జాబితాలను అందించాలని తెలిపారు. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదలవుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్ కరీంనగర్‌లోనే ఉంటుందని చెప్పారు. షెడ్యూల్ విడుదలైనందున ఈ నెల 10వ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో పాల్గొనే ప్రతిఒకరూ మాసు ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచించా రు. సిబ్బంది రెండు డోసుల సిబ్బందితోపాటు వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు తప్పకుండా రెండు డోసులు కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని ఉండాలన్నారు. ఎన్నికల తనిఖీ బృందాలను, ఫ్లయింగ్ స్కాడ్లు, స్టాటిక్ టీంల ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మోడల్కోడ్ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ఆర్డీఓలు ఆనంద్‌కుమార్, మాధురి, శ్రీనివాసరావు, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు పాల్గొన్నారు.