పెద్దపల్లి రూరల్, నవంబర్ 11: టీఆర్ఎస్ మహాధర్నాను విజయవంతం చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గర ఉదయం 10 గంటలకు జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ ధర్నాకు నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పీఏసీఎస్ చైర్మన్లు మాదిరెడ్డి నర్సింహారెడ్డి, దాసరి చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధర్మారం, నవంబర్11: కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నిర్వహించనున్న రైతుల ధర్నాను విజయవంతం చేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యా ల బలరాంరెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ఆదేశానుసారం గురువారం ధర్మారంలోని వైశ్య భవన్లో పార్టీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ అధ్యక్షతన ధర్నా విజయవంతంపై పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాంరెడ్డి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానిదేనని బాధ్యతంటూ రైతులను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. మండలం నుంచి రైతులను తరలించాలని కోరారు. సమావేశంలో పత్తిపాక ప్యాక్స్ చైర్మన్ నోముల వెంకట్ రెడ్డి,వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ధర్మారం ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, జిల్లా, కో ఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దీన్, ఎండీ రఫీ, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్‌రెడ్డి, గూడూరి లక్ష్మణ్, పెంచాల రాజేశం, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు కూరపాటి శ్రీనివాస్, దొనికెని తిరుపతి, నాయకులు మంద శ్రీనివాస్,భారత స్వామి, అజ్మీరా మల్లేశం నాయక్, ఎండీ హఫీజ్, దేవి నళినీకాంత్, దేవి వంశీ, రేగుల జితేందర్, పాల్గొన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్, అనుబంధ కమిటీల గ్రామ శాఖ అధ్యక్షులకు నియామకం పత్రాలను అందజేశారు.
మంథని టౌన్, నవంబర్ 11: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంథనిలో శుక్రవారం ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు ఏగోలపు శంకర్‌గౌడ్ గురువారం తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగనుందని వివరించారు. ధర్నాకు అన్ని మండలాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు విజయవంతం చేయాలని కోరారు.