నీ స్వార్థం కోసం ఎన్నిక తెచ్చినవ్
అవకాశవాద రాజకీయాలు చేస్తున్నవ్
గెల్లు గెలిస్తే ప్రజలు బాగు పడుతరు..
ఈటలకు ఓటేస్తే ఒక్కడే బాగుపడతడు
రైతుల ఉసురు పోసుకునే పార్టీ బీజేపీ
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్, అక్టోబర్ 11 :రాజేంద్రా.. బీజేపీకి ఓటెందుకు వెయ్యాలో ఒక కారణం చెప్పు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసి ఉద్యోగాలను ఊడగొడుతున్నందుకా? పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నందుకా? నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు తీసుకుంటున్నందుకా? ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెడుతున్నందుకా? ఏం చెప్పి ఓట్లు అడుగుతవ్.. టీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలో వంద కారణాలు చెప్తా.. రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నందుకు ఓటు వేయాలంటున్నం. ఆసరాతో ఆదుకుంటున్నందుకు మాకు అండగా ఉండుమంటున్నం.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో భరోసా కల్పిస్తున్నందుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నం. ఇంకా అనేక సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నందుకు గెల్లు సీనును గెలిపించిలని విజ్ఞప్తి చేస్తున్నం.
ఉద్యోగాలను ఊడగొడుతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ.. ప్రజలపై భారం వేస్తూ.. ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్న బీజేపీకి ఓటెందుకు వేయాలో ఒక్క కారణమైనా చెప్పాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల్లో నమ్మకం పెంచుకుంటున్న టీఆర్ఎస్కు ఓటెందుకు వేయాలో వంద కారణాలు చెప్తానని స్పష్టం చేశారు. సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, టేకుర్తి, శ్రీరాములపల్లి, కనగర్తి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వీధివీధినా తిరుగతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. సాయంత్రం కనగర్తిలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇవి నడుమంతరపు ఎన్నికలని, ఎక్కడైనా ఎవరన్నా చనిపోతే ఎన్నికలొస్తాయని, కానీ ఇక్కడ ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో ఇంత వరకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చేశాడా?, హుజూరాబాద్ జిల్లా కావాలని చేశాడా?, మెడికల్ కళాశాల మంజూరు చేయాలని చేశాడా? చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం స్వార్థం, అవకాశవాద రాజకీయాల కోసం రాజీనామా చేసి, పేద ప్రజల నడ్డి విరిచే, రైతుల ఉసురు పోసుకునే పార్టీలో చేరాడని మండిపడ్డారు.
ఇప్పుడు ఎన్నికలో బొట్టు బిల్లలు, ఛత్రిలు, క్వార్టర్ సీసాలు పంచుతున్నారని, వాటితో మన బతుకులు బాగు పడుతాయా? ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. ధర్మానికి, పనులు చేసే పార్టీలకు ఓటెయ్యాలే తప్ప సానుభూతి మాటలకు కాదని సూచించారు. తాము కుడి చేత్తో ఇస్తుంటే, బీజేపీ వాళ్లు ధరలు పెంచి ఎడమ చేత్తో లాక్కుంటున్నారని ఆరోపించారు. ‘రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన బేకార్ పార్టీ బీజేపీ’ అని విమర్శించిన ఈటల.. ఇప్పుడు ప్రజలకు ఏమైనా ఫర్వాలేదని తన రక్షణ కోసం ఆ పార్టీలో చేరాడని మండిపడ్డారు. వచ్చే ఉగాది తర్వాత రూ.లక్ష రుణమాఫీ వడ్డీతో సహా చేస్తామని హామీ ఇచ్చారు. న్యాయం, అన్యాయం ఆలోచించి ఓటెయ్యాలని కోరారు. ఈ నెల 30న మహిళలంతా సిలిండర్‌కు దండం పెట్టుకొని వెళ్లి సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపిన గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎవరి బాటలో నడిస్తే మనం బాగు పడుతామో, న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. “సీఎం కేసీఆర్‌కి మానవత్వం లేదని ఈటల రాజేందర్ అంటున్నడు.. ఒక్కసారి ఆసరా పింఛన్ తీసుకుంటున్న తల్లిని, కల్యాణలక్ష్మి చెక్కు తీసుకున్న అవ్వను, కేసీఆర్ కిట్టు తీసుకున్న మహిళలను అడిగితే మానవత్వం ఉందో లేదో తెలుస్తుంది’ అని ఈటలకు చురకలంటించారు.
మన రైతుల కోసం ఉచిత కరెంటు ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెడుతున్నదని మండిపడ్డారు. ఏపీ సీఎం మోటర్లకు మీటర్లు పెడుతుంటే, మన సీఎం కేసీఆర్ మాత్రం తన గొంతులో ప్రాణం ఉండగా పెట్టనివ్వనని కరాఖండిగా చెప్పారని గుర్తు చేశారు. కనగర్తిలోనే 100 ఇండ్లు కట్టించే బాధ్యత గెల్లుశ్రీనివాస్, తనది అని హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, ఎంపీపీ పావనీవెంకటేష్, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, సర్పంచ్‌లు వనమాల, ఆదిలక్ష్మి, మొగిలి, మట్ట రజిత వాసుదేవరెడ్డి, ఎంపీటీసీలు తెడ్ల ఓదెలు, దరుగుల రమ, ఉప సర్పంచ్ మహేందర్, మాజీ ఎంపీటీసీ రామిడి వీరారెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మట్టా సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దరుగుల రాకేశ్, ఎక్కేటి సంజీవరెడ్డి, మహేందర్, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
కనగర్తిలో అలరించిన ధూంధాం
ఇల్లందకుంట మండలంలోని కనగర్తిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ధూం-ధాం అలరించింది. గాయకుడు సాయిచంద్ ప్రభుత్వ పథకాలను కూలంకశంగా పాడిన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గొల్ల కురుమలు మంత్రి హరీశ్‌రావుకు గొర్రెను బహూకరించారు.