కార్పొరేషన్, అక్టోబర్ 11 : హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఉప ఎన్నికల సరళి, నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలిస్ అబ్జర్వర్ అనుపమ్అగర్వాల్, జనరల్ అబ్జర్వర్ ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్ ఎస్‌హెచ్ ఎలమురుగు జీ, పోలిస్ కమిషనర్ సత్యనారాయణలతో కలిసి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాలు హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్‌లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కంట్రోల్ రూం 1950, సి- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్లయింగ్ టీంలు 5, వీడియో సర్వలెన్స్ టీంలు 5, స్టాటిక్ సర్వలెన్స్ టీంలు 5, అకౌంటింగ్ టీం 1, మొత్తం 16 టీంలను 92 మందితో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ టీంల ద్వారా ఇంతవరకు రూ.1,38,65,927 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. 107 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా తరలించే మద్యాన్ని అరికట్టెందుకు ఎక్సైజ్ శాఖ ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నామన్నారు. కౌంటింగ్ రోజు కూడా మద్యం షాపులు మూసివేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి నిఘా పెట్టామని తెలిపారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మద్యం నియంత్రణపై, అదనపు కలెక్టర్, నోడల్ అధికారి శ్యాం ప్రసాద్ లాల్, ఎంసీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై, పోలిస్ కమిషనర్ వి.సత్యనారాయణ పోలిసుల బందోబస్తు, పోలిస్ తనిఖీలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల పరిశీలకులకు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, తదితరులు పాల్గొన్నారు.