కొడిమ్యాల,అక్టోబర్ 11: “తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు కనబడుత లేదా?” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రం అన్ని రంగా ల్లో ముందుందనే విషయాన్ని కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా చెప్పారని, ఇవేవి పట్టని సంజ య్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో బీజేపీకి చెందిన కొడిమ్యాల ఎంపీటీసీ-3 సామల్ల లక్ష్మణ్, 200 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరగా, వీరికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి వినోద్‌కుమార్ గులాబీ కండువాకప్పి ఆహ్వానించారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ యువతను రెచ్చగొట్టి గెలిచాడని ధ్వజమెత్తారు. ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. కరీంనగర్ అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా తేలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌తోనే అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు. రైతుబీమా, రైతుబంధు పథకాలతో అన్నదాతకు భరోసా లభించిందని చెప్పారు. 68 లక్షల మంది రైతులకు బీమా పథకాన్ని వర్తింపజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బండి పాదయాత్రలో ఏ ఒక్కరూ కూడా వినతిపత్రాలు ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుచేశారు. ఆయన యాత్రకు ప్రజల స్పందన కరువైందన్నారు. పోతారం రిజర్వాయర్‌లో నష్టపోయిన రైతులకు త్వరలో నష్ట పరిహారం అందించనున్నట్లు చెప్పారు. ఈ రిజర్వాయర్ నుంచి కోనాపూర్ వెళ్లేదారిలో త్వరలో బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. మండలానికి రూ.11 కోట్లతో 7 చెక్ డ్యామ్‌లు మంజూరైనట్లు చెప్పారు. అభివృద్ధిని చూసి కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని, ప్రతి కార్యకర్తా పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని సూచించారు. ఇక్కడ కొడిమ్యాల ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ జనగాం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ప్రసాద్, కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మెన్నేని రాజనర్సింగారావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ అంకం రాజేశం, ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, కొత్తూరి స్వామి, గడ్డం లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.