తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుంది
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 10: శాతవాహన విశ్వవిద్యాలయానికి యూజీసీ 12బీ హోదా కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేరొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో నెలకొన్న పలు సమస్యలను వీసీ మంత్రి దృష్టికి తీసుకురాగా, పరిషారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రెండు రోజులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్, వీసీ మల్లేశ్ ప్రత్యేక చొరవతో యూజీసీ నిబంధనలకు అనుగుణంగా యూజీసీ ప్రత్యేక బృందం యూనివర్సిటీని సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెప్పారు. తనిఖీ బృందం శాతవాహన యూనివర్సిటీకి అనుకూల నివేదికను యూజీసీకి అందజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బందిని మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు.