జమ్మికుంట నుంచి భారీ బైక్ ర్యాలీ
ఇల్లందకుంటలో 10 వేల మందితో సభ
వీణవంకలో రూ. 20 కోట్ల ఆస్తుల పంపిణీ
హాజరుకానున్న మంత్రులు కొప్పుల, గంగుల, ఎర్రబెల్లి
కరీంనగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్ రావు పర్యటించనున్నారు. ఇల్లందకుంటలో పది వేల మందితో బహిరంగ సభ నిర్వహించనుండగా వీణవంకలో మహిళా సంఘాలకు రూ. 20 కోట్ల ఆస్తులు పంపిణీ చేయనున్నారు. అంతకు ముందు ఉదయం 9 గంటలకు జమ్మికుంట నుంచి ఇల్లందకుంట మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీతో వెళ్లనున్న మంత్రులు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆయనతోపాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా వస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్ రావు పర్యటించనున్నారు. ఆయనతోపాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వస్తున్నారు. ఇల్లందకుంటలో పది వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తుండగా వీణవంకలో మహిళా సంఘాలకు రూ. 20 కోట్ల ఆస్తులు పంపిణీ చేయనున్నారు. ఇల్లందకుంటలో మంత్రి హరీశ్ రావు పొలిటికల్ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఇక్కడ టీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. వీణవంకలో ప్రభుత్వ కార్యక్రమం అయినందున డీఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..
జమ్మికుంట నుంచి భారీ బైక్ ర్యాలీ..
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు ఇల్లందకుంటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మికుంట నుంచి వెయ్యి ద్విచక్ర వాహనాలతో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఘన స్వాగతం పలుకుతున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జమ్మికుంట నుంచి ఇల్లందకుంట మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీతో వెళ్లనున్న మంత్రులు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభకు హాజరవుతారు.
వీణవంకలో మహిళా సంఘాలతో..
వీణవంక మండల కేంద్రంలో మహిళా సంఘాలతో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని 26 గ్రామ పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలి రానున్నారు. సుమారు రూ. 20 కోట్ల ఆస్తులను ఈ సందర్భంగా మంత్రులు మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయనున్నారు. ఇందులో 1,035 స్వశక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 5.65 కోట్లు, బ్యాంకు లింకేజీ కింద రూ. 10 కోట్లు, శ్రీనిధి కింద రూ. 4 కోట్లకు పైగా పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో ఎల్ శ్రీలతా రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు ఇక్కడ కార్యక్రమం ప్రారంభం కానుంది.