ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
వావిలాలలో వెయ్యి మందితో నిర్వహించిన యూత్ సమ్మేళనానికి హాజరు
జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్ 9: బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది పూటకో మాట మారుస్తూ , ఊరుకో వేషం వేస్తున్నాడని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. శనివారం జమ్మికుంట మండలం వావిలాలలో సుమారు వెయ్యి మందితో యూత్ సమ్మేళనం నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమాన్ని వదిలి ధరలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు కనబడుతున్నదని దుయ్యబట్టారు. విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీనిఇ ఖాజీపేటలో ఏర్పాటు చేస్తామని మాట తప్పిందని ఆరోపించారు. ఇప్పటికే లక్షన్నర ద్యోగాలను భర్తీ చేసిన తెలంగాణ సర్కారు త్వరలోనే మరో 70-80 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు. మతం పేరిట ఓట్లు దండుకుని ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఏమైనా పని చేసిండా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి వావిలాలలోనె స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించి, ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఇక్కడే స్మాల్ స్కేల్ పరిశ్రమను ఏర్పాటు చేసేలా చూస్తానని వెల్లడించారు.
ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో చేరక ముందే నియోజకవర్గంలో పార్టీ అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలను గెలుచుకుని ప్రభంజనం సృష్టించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ గుర్తు చేశారు. అనామకుడిగా ఉన్న ఈటలను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇస్తే అన్నం పెట్టిన చెయ్యినే నరికేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి సీటుపై కన్నేసి అత్యాశకు పోయాడని విమర్శించారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించేది టీఆర్ఎస్ మాత్రమేనని వివరించారు. యువనేత, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి సతీశ్‌రెడ్డి, నాయకులు భీరెడ్డి భరత్‌కుమార్‌రెడ్డి, మాల్క రమేశ్, పొల్నేని సత్యనారాయణరావు, ఎంపీపీలు అప్పారావు, దొడ్డం మమత-ప్రసాద్, పావుశెట్టి శ్రీధర్, వనం రెడ్డి, పాడి మల్లారెడ్డి, మ్యాక భగవాన్‌రెడ్డి, మధుసూదన్‌రావు, ఎంపీటీసీ మర్రి మల్లేశం, సత్యం, సర్పంచులు పాల్గొన్నారు.