ఆర్థిక ప్రమాణాలు, ఆత్మగౌరవం పెంచేందుకే దళిత బంధు
సామాజిక న్యాయం పాటించని ఈటల
బీజేపీవి చేతగాని మాటలు
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
వీణవంక, ఆగస్టు 9: ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారికి రాష్ట్రంలో లక్ష కోట్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడినా ఆగకుండా సంక్షేమ బాటలో తెలంగాణ రాష్ర్టాన్ని నడిపించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని సత్తుపల్లి ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య ఉద్ఘాటించారు. మండలంలోని కొండపాక, కిష్టంపేట గ్రామాల్లో సోమవారం దళిత బంధు పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దళిత వాడల్లో కలియదిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాజకీయాలకతీతంగా అమలవుతున్నాయా లేదా ప్రజలు గమనించాలని కోరారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దేశం లో సంక్షేమానికి చిరునామాగా మారింది తెలంగాణ రాష్ట్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలని, ఆర్థిక ప్రమాణాలు, ఆత్మగౌరవం పెంచేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చారని స్పష్టం చేశారు. నీతులు చెప్పే ఈటల రాజేందర్ సామాజిక న్యాయం పాటించలేదని , ప్రజల్లో విభేదాలు సృష్టించి నియోజకవర్గంలో అభివృద్ధి కుం టుపడేలా చేశారని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమాన్ని , అభివృద్ధిని విమర్శిస్తున్న ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధుకు లక్ష కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారని సీఎం కేసీఆర్ విమర్శించే నీవు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష కోట్లు నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. చేతకాని మాటలు మాట్లాడే బీజేపీ నాయకులు సమాజ వ్యతిరేకులని, అభివృద్ధి నిరోధకులని అన్నారు. దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకొని , దళిత జాతి తలెత్తుకునే విధంగా రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో జరుగనున్న దళిత బంధు సభను విజయవంతం చేసేందుకు ప్రతీ గడప నుంచి తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఆవాల అరుంధతి-గిరిబాబు, బండారి ముత్తయ్య, ఉపసర్పంచ్లు రామగుండం రాజ్‌కుమార్, అప్పాల శంకర్, ఎంపీటీసీ చదువు స్వరూప-నర్సింహారెడ్డి, దళిత సంఘం నాయకులు తాండ్ర శంకర్, దాసారపు శంకర్, అంబాల మధునయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.