సుడా మాస్టర్ ప్లాన్‌పై కసరత్తు
ఉపగ్రహాల సహాయంతో బేస్ మ్యాపులు తయారు
డ్రాఫ్ట్ సిద్ధం చేసేందుకు చర్యలు
సలహాల కోసం త్వరలోనే రెండోసారి సమావేశం
కార్పొరేషన్, జనవరి 9;కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో నూతన మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమృత్ కింద పట్టణాలు, నగరాలకు బేస్మ్యాప్లతో పాటు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో సుడా పరిధిలో మాస్టర్ ప్లాన్‌పై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా ఏళ్ల కిత్రం తయారు చేసిన మాస్టర్‌ప్లాన్ మున్సిపాలిటీ పరిధిలో పూర్తిస్థాయిలో అమలైన దాఖలాలు లేవు. ఈ సారి పట్టణాలు, డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో మాస్టర్ ప్లాన్ మేరకు అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులోభాగంగా ఇప్పటికే భవన నిర్మాణ అనుతులకు సంబంధించి బీ పాస్‌ను అమలు చేస్తున్నది.
భవిష్యత్తు అవసరాల దృష్టితో
వచ్చే 20 ఏళ్లలో పెరుగనున్న జనాభా, ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీల పరిధిలో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ముందుగా అక్కడ ఉన్న తాజా పరిస్థితుల సమగ్ర వివరాలతో బేస్ మ్యాపులు ఎంతో అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని రెండేళ్ల కిత్రమే అన్ని మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం బేస్ మ్యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఈ మాస్టర్ ప్లాన్‌ను కూడా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ఆధారంగా ఉపగ్రహాల సహాయంతో సిద్ధం చేయనున్నారు. కాగా, ఇప్పటికే కరీంనగర్ బల్దియాకు సంబంధించి బేస్‌మ్యాప్ ఆధారంగా మాస్టర్ ప్లాన్ ఏర్పాట్లు చేయగా. . సుడా కూడా రావడంతో దానికి అనుసంధానంగా ఇప్పుడు మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా సుడా పరిధిలో కరీంనగర్‌తోపాటు, కొత్తపల్లి మున్సిపాలిటీ, 72 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్లాన్ సిద్ధం చేయనున్నారు. వంద, 80, 60 ఫీట్ల రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పట్టణాలనుంచి పంచాయతీల వరకు విశాలంగా రోడ్లు ఉన్న పంచాయతీల పరిధిలో 20 నుంచి 30 ఫీట్ల రోడ్లు మాత్రమే ఉన్నాయి. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ప్రతి రోడ్డు కూడా 30 ఫీట్ల మేరకు ఉండాలి. ఈ మేరకు రోడ్లను విస్తరించే అవకాశాలున్నాయి. అలాగే ఆయా ప్రాంతాలను కలుపుతూ చేపట్టే రోడ్లను సుడా కింద అభివృద్ధి చేయనున్నారు.
పక్కాగా అభివృద్ధి ప్రణాళికలు
సుడా పరిధిలో రానున్న రోజుల్లో పక్కా ప్రణాళిక మేరకు అభివృద్ధి చేసే దిశగానే ఈ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. ముఖ్యంగా గృహ, కమర్షియల్ ఏరియాలుగా వేటిని ఎలా గుర్తించాలి?, పరిశ్రమల స్థాపనకు ఎక్కడ స్థలాలను అందుబాటులో ఉండే వీలు ఉందన్న విషయంలోనూ అధికారులు దృష్టి సారించనున్నారు. సుడా పరిధిలోకి వచ్చే సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాలపై కూడా దృష్టి సారించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. సుడా పరిధిలో పూర్తిగా ఎక్కడెక్కడ ఏయే ఏరియాలు ఉండాలన్న విషయంలోనే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు చెప్పుతున్నారు.
కొనసాగుతున్న పనులు
మాస్టర్ ప్లాన్ కోసం ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ అనే కన్సల్టెన్సీ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు వీరు సుడా పరిధిలో ఉన్న వెట్టింగ్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఇందులో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని జీఐఎస్ విధానంలో వెట్టింగ్ మ్యాప్ సిద్ధం చేశారు. కొవిడ్‌కు ముందు సుడా పరిధిలోని ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంక్రాంతి పండుగ తర్వాత పరిస్థితులు అనుకూలిస్తే సుడా పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రజల సలహాలను తీసుకునేందుకు మరోసారి సమావేశం ఏర్పాటు చేసేందుకు కన్సల్టెన్సీ ప్రతినిధులు సిద్ధం అవుతున్నారు. ఈ సలహాలు, సూచనల అనంతరం ఓ డ్రాఫ్ట్ మ్యాప్‌ను సిద్ధం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాదిలోగా ఈ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసి అమలులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి.