యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు
వరి కంటే లాభసాటి రకాలు
ఉమ్మడి జిల్లాలో రైతులకు ఉపయుక్తం
పంట మార్పిడిపై అధికారుల దృష్టి
కరీంనగర్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) ;యాసంగిలో దొడ్డు వడ్లను కొనుగోలు చేసేదిలేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నది. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో రెండు దశాబ్దాల క్రితం కేవలం 2 లక్షల ఎకరాల్లోనే సాగైన వరి.. ఇప్పుడు నీటి వసతి పెరిగి 10 లక్షలకుపైగా ఎకరాల్లో సాగవుతుండడంతో సంప్రదాయ, ఆరుతడి పంటలు కనుమరుగయ్యాయి. వీటి ఉత్పత్తులు తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటాయి. ఓవైపు ఈ కారణం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఖరితో మళ్లీ ఆరుతడి పంటలపై దృష్టిసారించాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఈ యాసంగికి ఎలాంటి పంటలు వేసుకోవచ్చో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కొన్ని పంటలను సిఫారసు చేస్తున్నది. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలను సూచిస్తున్నది.
వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం మెలిక పెడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటలపై మళ్లించేలా చర్యలు చేపడుతున్నది. అధిక మొత్తంలో వరి సాగు చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే ప్రమాదముండడంతో ఆరుతడి పంటలు వేసేలా ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం సబ్సిడీపై విత్తనాలను సిద్ధంగా ఉంచింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఏయే ఆరుతడి పంటలు వేయొచ్చు? ఎలా సాగు చేయాలి? ఎప్పుడు వేయాలి? సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఎంత దిగుబడి వస్తుంది? వంటి విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరించారు.
కుసుమ
కుసుమ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎకరాకు 3.6 క్వింటాళ్ల దిగుబడి వచ్చే కుసుమకు క్వింటాల్‌కు రూ.4,600 ధర ఉంది. టీఎస్ఎఫ్1, మంజీర, టీఎస్ఎఫ్ 764, సాగార ముత్యాలు రకాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫారసు చేస్తోంది. నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. 20 కిలోల నత్రజని (45 కిలోల యూరియా), 10 కిలోల భాస్వరం (62 కిలోల సూపర్ ఫాస్పేట్) వాడుకోవాలి. కాండం సాగే దశ లేదా పూత దశలో ఒక నీటి తడి ఇవ్వాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పెసర
పప్పుధాన్యాల్లో ప్రధానమైనది పెసర. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పెసరకు మార్కెట్లో క్వింటాల్‌కు రూ.6,600 ధర పలుకుతోంది. ఎమ్జీజీ 295, డబ్ల్యూజీజీ 37, టీఎం 96-2, ఎంజీజీ 348, ఎంజీజీ 347, ఎంజీజీ 351, డబ్ల్యూజీజీ 42 రకాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు సిరఫారసు చేస్తున్నారు. వరి తర్వాత డిసెంబర్ 10 వరకు విత్తుకోవచ్చు. 8 కిలోల నత్రజని (18 కిలోల యూరియా), 20 కిలోల భాస్వరం (125 కిలోల సూపర్ ఫాస్పేట్) ఎకరాకు వాడాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి. లీటరు నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం తేడాతో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
పొద్దు తిరుగుడు
యాసంగిలో గతంలో జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొద్దుతిరుగుడు మంచినూనెకు డిమాండ్ ఉంది. ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పొద్దుతిరుగుడుకు క్వింటాల్‌కు రూ.5,900 ధర ఉంది. కేబీఎస్‌హెచ్ 44, ఎస్బీఎస్హెచ్1, డీఆర్‌ఎస్‌హెచ్1, కేబీఎస్‌హెచ్ 78 రకాలు డిసెంబర్ 30 వరకు విత్తుకోవచ్చు. 24 కిలోల నత్రజని (52 కిలోల యూరియా), 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ ఫాస్పేట్), 12 కిలోల పొటాష్ (20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) ఎకరాకు వాడుకోవాలి. పైరు పూత దశలో 2 గ్రాముల బొరాక్స్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. జిప్సం 55 కిలోల ఎకరాకు వేయాలి.
మినుము
యాసంగిలో మరో ప్రధానమైన ఆరుతడి పంట మినుము. ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చే మినుముకు మార్కెట్లో రూ.6,500 ధర ఉంది. ఎల్బీజీ 752 ఎల్బీజీ 20, ఎల్బీజీ 623, డబ్ల్యూబీజీ 26, ఎంబీజీ 207, పీయూ31, ఎల్బీజీ 787 రకాలను డిసెంబర్ 10 వరకు విత్తుకోవచ్చు. 8 కిలోల నత్రజని (18 కిలోల యూరియా), 20 కిలోల సూపర్ ఫాస్పేట్) ఎకరాకు వాడుకోవాలి. ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి. లీటరు నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ఒక గ్రాము నిమ్మ ఉప్పులో కలిపి పైరుపై వారం తేడాలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
పల్లి
యాసంగిలో ఈ పంట మంచి దిగుబడులను ఇస్తుంది. ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో క్వింటా ధర రూ.5,500 పలుకుతోంది. ఉమ్మడి జిల్లాలో నవంబర్ 30 వరకు పల్లి విత్తుకునే అవకాశం ఉంది. కదిరి 6, కదిరి 1812, టీఏజీ 24 రకాల విత్తనాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫారసు చేసింది. ఈ పంట సాగు చేసే రైతులు ఎకరాకు 200 కిలోల జిప్సమ్‌ను పూత దశలో పూర్తయిన ఊడలు దిగే సమయంలో మొదళ్ల దగ్గర వేసి మట్టిన ఎగదోయాలి. ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల తర్వాత రెండుసార్లు పిచికారీ చేయాలి. ఇనుపధాతు లోపం అధిగమించడానికి ఎకరాకు కిలో అన్నభేది, 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లం, 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.