ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి
హుజూరాబాద్ అభివృద్ధి కోసం గెల్లును గెలిపించండి
టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు
ఇది ఈటల అహంకారానికి, పేదల ఆత్మగౌరవానికి మధ్య పోరాటం : గెల్లు శ్రీనివాస్
హుజూరాబాద్/హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 8 : సీఎం కేసీఆర్ సంపదను పెంచుతూ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు పంచుతున్నారని, అదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదలను దోచుకుంటూ పెద్దలు, గద్దలకు పెడుతున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బడా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసిన సంగతి గుర్తుచేశారు. రైతు బంధువైన టీఆర్ఎస్కు, రైతుల ఉసురు తీస్తున్న రాబందులకు మధ్య ఈ పోటీ జరుగుతున్నదని, ప్రజలందరూ ఎటువైపు ఉంటారో ఆలోచించుకోవాలని సూచించారు. ఒకవేళ బీజేపీకి ఓటు వేస్తే పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను ఆమోదించినట్లే అవుతుందని, ఇదే అదనుగా అడ్డూఅదుపు లేకుండా పెంచుతారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ధర్నా చేస్తున్న రైతులపై కారు ఎకించి చంపినందుకు ఓట్లు వేయాలా.. లేకపోతే ఓ కేంద్ర మంత్రి రైతులను ఖలిస్తాన్ తీవ్రవాదులతో పోల్చినందుకు ఓట్లు వేయాలా అని మండిపడ్డారు. హర్యానా సీఎం ఖట్టర్ రైతులను పట్టుకొని లాఠీలతో కొట్టండని చెప్పినందుకు ఓట్లు వేయమంటారా అని ప్రశ్నించారు. ఇది అబద్ధాల బీజేపీకి నిబద్ధత గల టీఆర్ఎస్కు మధ్య జరుగుతున్న ఎన్నిక అని.. ప్రజలు ఏ వైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు. అమ్మకానికి పెట్టినపేరు బీజేపీ అయితే నమ్మకానికి మారుపేరు టీఆర్ఎస్ అని, ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రూపాయి బొట్టు బిల్లకు, లక్ష రూపాయల కల్యాణలక్ష్మికి మధ్య పోటీ జరుగుతుందని, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తారు తప్ప.. ప్రలోభాలకు లొంగరనే విషయం గుర్తుపెట్టుకోవాలని హరీశ్‌రావు హితవు పలికారు. నయవంచనకు, అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే తట్టుకోలేని బీజేపీ నేతలు కేసీఆర్ తమ ఆస్తులు అమ్మి డబ్బులు ఇస్తున్నారా అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలను ఎందుకు అమలుచేయడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాణం ఉండగా రాష్ట్రంలో మీటర్లు పెట్టేది లేదని సీఎం ఖరాకండిగా చెబుతున్నారన్నారు.
అహంకారానికి, ఆత్మగౌరవానికి పోరాటం
ఈ ఎన్నిక ధనబలంతో విర్రవీగుతున్న ఈటల రాజేందర్ అహంకారానికి, పేద ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. నామినేషన్ వేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈటల తనకు 200 ఎకరాలున్నాయని, ఒక ఎకరం భూమి అమ్మి గెలుస్తానని బహిరంగంగానే చెప్పారని, తనకు రెండు గుంటలు మాత్రమే ఉందని స్పష్టంచేశారు. రాజేందర్ భార్య ఆస్తులు అమ్మైనా గెలుస్తామని దగ్గరి వాళ్లతో చెబుతున్నదని, అయితే నా గెలుపును వందల కోట్లు ఆపలేవని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, ప్రజల ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని, హుజూరాబాద్ అభివృద్ధి చేసే శక్తి దేవుడు నాకిచ్చాడన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, నాయకులు దొంత రమేశ్, చందమల్ల బాబు తదితరులున్నారు.
ప్రజల నుంచి అద్భుత స్పందన..
ప్రచారంలో ప్రజల నుంచి ఆదరణ అద్భుతంగా వస్తున్నదని, ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభిస్తున్నదన్నారు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ కోసం పేదింటి మహిళలు ఆసరా పెన్షన్ డబ్బులు కూడా ఇస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలుస్తామన్న సంపూర్ణ విశ్వాసం ఉందని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. హుజూరాబాద్‌లో 2001నుంచి టీఆర్ఎస్ బలంగా ఉందని, స్థానిక ఎన్నికల్లో రైతు నాగలి గుర్తుతో 95శాతం స్థానాలు దక్కించుకున్న ఘనత ఉందన్నారు. ఈటల రాజేందర్ రాక ముందు నుంచి కూడా ఇక్కడ గెలిచింది టీఆర్ఎస్సేనని, రాజేందర్ వెళ్లిపోయినా గెలిచే పార్టీ టీఆర్ఎస్ మాత్రమేని స్పష్టంచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతులకు, చేనేత కార్మికులకు రుణాలు మాఫీ చేసి ఆదుకుందని, బీజేపీ రుణమాఫీ పేరుతో కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చుతుందన్నారు. హుజూరాబాద్ ప్రాంతంలో 60నుంచి 70వేల మంది రైతులు వ్యవసాయరంగంపై ఆధారపడ్డారని.. నాణ్యమైన కరెంట్, కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు నీళ్లు, రైతు బంధు, రైతు బీమా, రైతుల కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరించడంతో పాటు చెక్‌డ్యాంలు, రైతు వేదికలు నిర్మించామని ఇలా చెప్పుకుంటూ పోతే దినమంతా గడుస్తుందన్నారు. పని చేసే ప్రభుత్వం మీద విమర్శలు చేసి సెంటిమెంట్‌తో ఓట్లు పొందాలని చూస్తున్నారని, సానుభూతి మాటలు మన కడుపు నింపవన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని గెల్లు శ్రీనివాస్‌కు పాటు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.