జమ్మికుంట, అక్టోబర్ 8: ఏడేండ్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోలేదని, కన్నతల్లిలాంటి పార్టీని వదిలి బీజేపీలో చేరిండని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని 24వ వార్డు ప్రజలతో కొప్పుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీజేపీ నుంచి ఎంపీ గా గెలిచిన బండి సంజయ్ రెండున్నరేండ్లయినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి.. సంక్షేమం ముందుకు సాగాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికే అండగా ఉండాలని కోరారు. దళితబంధుపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హితవుపలికారు. నియోజక వర్గంలో అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకే ఓటెయ్యాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, నాయకులు రాజ్‌కుమార్, కోటి, సు ధాకర్, తిరుపతి, కిషన్, చందు, కిరణ్, రమేశ్, సదానందం, మాణిక్యం తదితరులున్నారు.
సూపర్‌మార్కెట్ సందర్శన
మున్సిపల్ పరిధిలోని గణేశ్‌నగర్‌కు చెందిన దళితబంధు లబ్ధిదారు బాజాల సంధ్య-గంగయ్య వీణవంక ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసుకున్న సూపర్‌మార్కెట్‌ను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం సందర్శించారు. నిత్యావసరాలు కొనుగోలు చేసి సంధ్యకు బిల్లు చెల్లించారు. ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రిని లబ్ధిదారు కుటుంబ సభ్యులు సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు తదితరులున్నారు.
కులవృత్తులను కాపాడుతున్నది కేసీఆరే..
కనుమరుగవుతున్న కులవృత్తులను కాపాడుతున్నది సీఎం కేసీఆరేనని, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌కు నిధులు కేటాయించే అంశం సీఎం పరిశీలనలో ఉన్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హుజూరాబాద్ మండలం శాలపల్లి దినేశ్ కన్వెన్షన్‌లో నాయీబ్రాహ్మణులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నాయీబ్రాహ్మణులు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారని కొనియాడారు. ప్రజలందరికీ శ్రీరామరక్షగా సీఎం కేసీఆర్ ఉన్నారని, టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరా రు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణులంతా కారు గుర్తుకే ఓటేస్తామని ప్రతినబూనారు. ప్రజాప్రతినిధులు, నాయకులున్నారు.