ఉపాధి యూనిట్లతో ఆర్థికాభివృద్ధి సాధించాలి
పథకం లబ్ధిదారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచన
హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో మంజూరైన యూనిట్ల పరిశీలన
హుజూరాబాద్ రూరల్/ టౌన్/ జమ్మికుంట రూరల్, జనవరి 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. లాభదాయకమైన ఉపాధి యూనిట్‌ను ఎంపిక చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. శనివారం హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో ఆయన పర్యటించారు. పలువురు దళితబంధు లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను పరిశీలించారు. హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామంలో డెయిరీ యూనిట్ ఏర్పాటు చేసుకున్న కొత్తూరి రాధ-మొగిలి దంపతులతో మాట్లాడారు. డెయిరీతో వస్తున్న లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాడి గేదెలకు మంచి దాణా, పచ్చి గడ్డి వేస్తే అధిక పాలు ఇస్తాయని చెప్పారు. లబ్ధిదారులు డెయిరీ యూనిట్లకు ప్రాధాన్యం ఇస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించవచ్చన్నారు. అనంతరం చెల్పూర్ గ్రామంలో కనకం రాజ్‌కుమార్-చంద్రకళ దంపతులు స్థాపించిన శ్రీమాత క్లాత్ స్టోర్ యూనిట్‌ను సందర్శించి, టైలరింగ్ మిషన్, కిడ్స్‌వేర్, లేడీస్ ఎంపోరియంలోని దుస్తులను పరిశీలించారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం వస్తున్నదని లబ్ధిదారులు కలెక్టర్‌కు వివరించారు. క్లాత్ షోరూంలో ఆధునిక మిషన్లను ఏర్పాటు చేసుకొని కొత్త డిజైన్లతో దుస్తులు తయారు చేసి అధిక లాభాలు గడిస్తూ మరో నలుగురికి ఉపాధి కల్పించాలని కలెక్టర్ సూచించారు. తర్వాత హుజూరాబాద్ పట్టణంలో శనిగరపు సరోజ-రవీందర్ స్థాపించిన సిమెంట్, సలాక సప్లయర్స్ యూనిట్‌ను సందర్శించారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ఉంటుందని, అందుకు సిమెంట్, ఇటుక తప్పకుండా కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. సిమెంట్, సలాక దుకాణంతో తక్కువ రోజుల్లోనే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. జూపాక సమీపంలో వరి సాగును కలెక్టర్ పరిశీలించారు.
అక్కడే ఉన్న అశోక్ అనే రైతును వరి ధాన్యం ఎలా విక్రయిస్తావని అడుగగా, విత్తన కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నామని, పండిన ధాన్యాన్ని కంపెనీ వాళ్లే కొనుగోలు చేస్తారని చెప్పాడు. జమ్మికుంట మండలం కోరపల్లిలో వీర్ల మల్లమ్మ డెయిరీ ఫాంను కలెక్టర్ పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన డెయిరీ షెడ్డును ప్రారంభించారు. పాల ఉత్పత్తి, పశువుల పోషణపై డెయిరీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జమ్మికుంట పట్టణంలో బాజాల సంధ్య ఏర్పాటు చేసుకున్న మహేశ్వర సూపర్‌మార్ట్, జీ సుగుణాఅశోక్ కొనుగోలు చేసిన లేలాండ్ వాహనాన్ని పరిశీలించారు. ఆదాయ వివరాలను అడిగి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్థికంగా ఎదిగేందుకు దళిత బంధు పథకం గొప్ప అవకాశమన్నారు. దీని ద్వారా మంజూరైన యూనిట్లను సక్రమంగా నడిపించుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధించాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. కాగా, దళిత బంధు పథకం పరిశీలనకు వచ్చిన కలెక్టర్‌ను కోరపల్లి సర్పంచ్ గిరవేన రమ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు సన్మానించి, స్వాగతం పలికారు. కలెక్టర్ వెంట హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్లు రాంరెడ్డి, రాజ్, ఎంపీడీవోలు రమేశ్, కల్పన, క్లస్టర్ అధికారి గంగరాం, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, పశువైద్యుడు ప్లవన్మజుందార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు కడవేర్గు మమత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్‌తోపాటు తదితరులు ఉన్నారు.