మన్నెంపల్లి యువతి ప్రేమకథ విషాదాంతం
పెళ్లి ఇష్టంలేక హత్య చేసిన ప్రియుడు
చెంజర్ల గుట్టపై ఘటన
సాదుకున్న ఇద్దరు తల్లులకు తీరని దుఃఖం
తిమ్మాపూర్ రూరల్/ మానకొండూర్ రూరల్, జనవరి 8: ఐదేళ్లుగా యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక చివరకు దారుణంగా హతమార్చాడు. దత్తత తీసుకుని పెంచుకున్న ఇద్దరు తల్లులకు తీరని దుఃఖం మిగిల్చాడు. శనివారం వెలుగు చూసిన ఈ ఘోరం కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలంలోని పోరండ్లకు చెందిన అసోద అఖిల్, మన్నెంపల్లికి చెందిన ఆరెల్లి వరలక్ష్మి (19) ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దలకు చెప్పగా, ఇరు కుటుంబాల వారు ఒప్పుకోలేదు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. అప్పటి నుంచి వేరుగా ఉంటున్నారు. వరలక్ష్మి ఇంటర్లో ఫెయిలైనప్పటి నుంచి మేకలను కాస్తూ, కుటుంబానికి ఆసరాగా ఉంటున్నది. ఈ నెల ఒకటిన ఎప్పటిలాగే మేకలను మేపేందుకు పోరండ్ల శివారులోకి వెళ్లింది. ఈ సమయంలో అఖిల్ మరో యువకుడితో వచ్చి ఆమెను బెదిరించి బైక్‌పై తీసుకెళ్లినట్లు పలువురు గ్రామస్తులు చెబుతున్నారు. కుటుంబసభ్యులు తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల 5 ఎల్ఎండీ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
పెళ్లి ఇష్టం లేకే..
అఖిల్‌పై అనుమానంతో పోలీసులు పలుసార్లు విచారించారు. ఎంతకూ చెప్పకపోవడం తో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో అఖిల్ నిజం ఒప్పుకున్నాడు. తాము ఎప్పుడు కలుసుకునే చెంజర్ల గుట్ట వద్దకు వరలక్ష్మిని తీసుకెళ్లానని, పెళ్లి విషయమై గొడవ జరగడంతో అక్కడే చున్నీతో ఉరేసి చంపినట్లు తెలిపాడు. తర్వాత మానకొండూర్ మండలం చెంజర్ల గుట్టపైన మృతదేహం వద్దకు శనివారం ఉదయం తీసుకెళ్లి చూపించాడు. తిమ్మాపూర్, మానకొండూర్ సీఐలు శశిధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోశవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
సాదుకున్న పాణం విలవిల
మన్నెంపల్లికి చెందిన బోయిని రాజవ్వ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండేది. ఈమె సోదరి ఆరెల్లి పోశవ్వ భర్త మరణించడంతో ఆమె కూడా మన్నెంపల్లిలోనే ఉంటున్నది. పోశవ్వకు పిల్లలు లేకపోవడంతో అనాథశ్రమం నుంచి నెల రోజుల్లోపు వయసున్న పసికందును తెచ్చకున్నది. వరలక్ష్మిని అని పేరు పెట్టింది. రాజవ్వ, పోశవ్వ ఇద్దరు అల్లరుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంటర్ వరకు చదివించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ ఇప్పుడు అనుకోని రీతిలో చనిపోవడంతో ఆ తల్లులిద్దరు హతాశులయ్యారు. శనివారం మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. పోచవ్వ రోదించిన తీరును చూసి కుటుంబసభ్యులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. యువతి హత్య విషయం తెలియడంతో లా అండ్ ఆర్డర్ అడ్మిన్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు.