
హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 7: రైతులు యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, తద్వారా తకువ పెట్టుబడితో ఎకువ ఆదాయం లభిస్తుందని వ్యవసాయ శాఖ ఏడీఏ దోమ ఆదిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి, కందుగుల, సింగాపూర్ గ్రామాల్లో రైతులకు వరికి బదులు ఇతర పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏవో సునీల్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఏడీఏ ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు యాసంగిలో వేరుశనగ, నువ్వులు, కుసుమ, పెసర, మినుము, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేయడం మేలని చెప్పారు. సీడ్స్ కంపెనీల ప్రతినిధులు నుంచి హామీ తీసుకున్న వారు మాత్రమే వరి సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని పెద్దపాపయ్యపల్లి, మంథనపల్లిలో రైతులకు ఆరుతడి పంటల సాగు విధానంపై ఏఈవో పొద్దుటూరు సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్, రైతులు పాల్గొన్నారు.
డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి
సైదాపూర్/ జమ్మికుంట రూరల్/ వీణవంక/ ఇల్లందకుంట, డిసెంబర్ 7: యాసంగిలో రైతులు వరికి బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచించారు. మంగళవారం హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని సైదాపూర్ మండలం పెర్కపల్లి, జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారం, వీణవంక మండలం కోర్కల్, నర్సింహులపల్లి, ఇల్లందకుంట మండలం సిరిసేడు, మర్రివాణిపల్లె, రాచపల్లి, మల్యాల, కనగర్తి గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుతడి పంటలకు సంబంధించిన కరదీపికను రైతులకు పంపిణీ చేశారు. పొద్దుతిరుగుడు, కంది, పెసర, బబ్బెర, వేరుశనగ, శనగ, వంటి ఆరుతడి పంటల యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. వాటిని సాగు చేయడం ద్వారా కలిగే లాభాల గురించి తెలిపారు. పెర్కపల్లి గ్రామంలో కౌలురైతు సాగు చేస్తున్న కుసుమ పంటను ఏవో పరిశీలించి ఇతర రైతులకు సాగు విధానాన్ని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో సైదాపూర్ ఏవో వైదేహి, ఏఈవో కాటం రాజు, జమ్మికుంట ఏవో గోవర్ధన్‌రెడ్డి, ధర్మారం సహకార సంఘం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులతోపాటు ఏఈవో రాంప్రసాద్, వీణవంక ఏఈవో అచ్యుత్, రైతులు కుమార్, వంతడుపుల రవీందర్, కర్ర శ్రీధర్‌రెడ్డి, కొలిపాక తిరుమల్, ఇల్లందకుంట ఏఈవోలు మౌనిక, రాకేశ్, మహేందర్, సంపత్, ఆత్మ ఏపీఎం స్రవంతి, రైతులు పాల్గొన్నారు.