
మల్లన్నపల్లె రైతులకు నాబార్డు అధికారుల కితాబు
చొప్పదండి సహకార సంఘంతో పాటు గ్రామ సందర్శన
చొప్పదండి, డిసెంబర్ 7: మల్లన్నపల్లి రైతులు తీరొక్క పంటలను పండిస్తూ సమీకృత వ్యవసాయం చేయడం అభినందనీయమని రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ వ్యాస్ అండ్ వ్యాస్ సంస్థ, ముంబై బ్రాంచ్ ఆడిట్ అధికారులు సంజయ్ కార్గ్, యోగేశ్ రూపాని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు మండలంలోని మల్లన్నపల్లి గ్రామాన్ని కరీంనగర్ నాబార్డు డీడీఎం మనోహర్‌రెడ్డితో కలిసి వారు సందర్శించారు. సంఘం చేపడుతున్న కార్యకలాపాలపై, లావాదేవీలపై సంఘ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సంఘం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సభ్యులకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సమీకృత వ్యవసాయ విధానం (యూపీఎన్ఆర్ఎం) ప్రాజెక్ట్‌లో భాగంగా నాబార్డు సంస్థ నుంచి రూ. కోటీ 66లక్షలు, జిల్లా సహకార సంఘం నుంచి రూ.90 లక్షలు మొత్తం రూ. 2.56 కోట్లు చొప్పదండి సహకార సంఘం ద్వారా రైతులకు రుణాలు ఇచ్చినట్లు సంఘ చైర్మన్, సీఈవో అధికారులకు తెలిపారు. అనంతరం అధికారులు మల్లన్నపల్లి, గుమ్లాపూర్, చొప్పదండి గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడారు. రైతులు సాగుచేస్తున్న బంతిపూలు, కూరగాయలతోపాటు పెరటికోళ్ల పెంపకం వల్ల వచ్చే ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూపీఎన్ఆర్ఎం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నపల్లి రైతులు రుణాలు పొంది తీరొక్క పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పంటలే కాకుండా కోళ్ల పెంపకంతో ఆదాయాన్ని పెంచుకుని అభివృద్ధి చెందుతున్నారని అభినందించారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని రైతులు పంట మార్పిడి విధానం అలవాటు చేసుకోవాలని, తద్వారా మంచి దిగుబడి వచ్చే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. చొప్పదండి సహకార సంఘం నాబార్డు ఆధ్వర్యంలో సమీకృత వ్యవసాయ విధానం ద్వారా రైతులకు రుణాలు ఇస్తూ ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి, కేడీసీసీ జీఎం శ్రీధర్, పీడీసీ రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ, బ్రాంచ్ మేనేజర్ శ్రీలత, సంఘం డైరెక్టర్ ఆనందరెడ్డి, తిరుపతిరెడ్డి, పద్మ, బండారి కొమురయ్య, కార్యదర్శి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.