నేటి నుంచి 11 వరకు గ్రామసభలు
అదేరోజు నుంచి అర్జీల స్వీకరణ
2005కి ముందు సాగులో ఉన్న వారే అర్హులు
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారంపై సర్కారు దృష్టిపెట్టింది. అన్ని పక్షాల సహకారంతో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇందుకు నేటి నుంచి ఈ నెల 11వరకు గ్రామసభలు నిర్వహించనున్నది. 2005 డిసెంబర్ 13కు ముందు నుంచి సాగుచేస్తున్న వారు అర్జీలు అందజేయాలని సూచించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత తొందరలో హక్కు పత్రాలు అందజేయనుండగా ఆయావర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
దశాబ్దాలుగా ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి సర్కారు ఉపక్రమించింది.. భూముల్లేని పేదలకు న్యాయం చేస్తూనే అటవీ ప్రాంతం సంరక్షణకు చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు రాజన్నసిరిసిల్ల జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. మున్సిపల్, పరిశ్రమల శాఖల మంతి కేటీఆర్ సూచనల మేరకు నేటి నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నది.
నేటి నుంచి అవగాహన సదస్సులు
అటవీ చట్టం 2005-06 ఆర్వోఎఫ్ఆర్పై అవగాహన కల్పించేందుకు నేటి నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, స్పెషలాఫీసర్లు, సర్వేయర్లు, అటవీశాఖ అధికారులుంటారు. సదస్సులో ప్రజాప్రతినిధులతో పాటు అన్ని పార్టీల నాయకులు పాల్గొననున్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారితో పాటు గ్రామీణులకు అటవీ హక్కుల చట్టాలపై అవగాహన కల్పిస్తారు. 2005 డిసెంబర్ 13 తేదీకి ముందు నుంచి సాగు చేసుకుంటున్న వారు, సెంటు భూమి కూడా లేని పేదలకు మాత్రమే భూమి హక్కు కల్పించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు తరాల వాళ్లు ఆ భూమిపై హక్కు కలిగి ఉన్నారని నిరూపించిన గిరిజనేతరులకు సైతం పట్టా జారీ చేయనున్నారు.
అటవీ హక్కుల కమిటీల ఎన్నిక
గ్రామసభల్లో దరఖాస్తు ఫారాలు అందజేయడంతో పాటు ఎలా అర్జీ పెట్టుకోవాలో వివరిస్తారు. ఇందులోనే 15 మందితో అటవీ హక్కుల కమిటీని ఎన్నుకుంటారు. ఈ కమిటీల్లో 1/3వ వంతు గిరిజనులు లేదా మహిళలు ఉండనున్నారు. కమిటీ బాధ్యులు పోడు భూములపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తారు. ఎక్కడైనా ఒకే గ్రామంలో రెండు ఆవాసాల్లో అటవీ భూములు ఆక్రమణకు గురైతే రెండు చోట్ల గ్రామ సభలు నిర్వహిస్తారు. పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శులు పోడు దరఖాస్తులను తీసుకొని రసీదులు అందజేస్తారు. అర్జీదారులు తమ వద్ద ఉన్న పత్రాలు, అటవీశాఖ అధికారులు పెట్టిన పత్రాలు దరఖాస్తు ఫారానికి జతచేసి, గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమర్పించాలి. దరఖాస్తు తీసుకున్న తర్వాత కార్యదర్శి నుంచి తప్పని సరిగా రసీదు తీసుకోవాలి. దరఖాస్తులను గ్రామ కార్యదర్శితో పాటు అటవీ హక్కుల కమిటీ పరిశీలించి అర్హులైన వారి దరఖాస్తులను ఉన్నతాధికారులకు నివేదిస్తుంది.
స్వాగతించిన ప్రతిపక్షాలు
పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అన్ని రాజకీయ పక్షాలు స్వాగతించాయి. మంత్రి కేటీఆర్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరింలో ప్రతిపక్షాలు, ప్రజాప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు. మంత్రి సైతం సావధానంగా విని సానుకూలంగా స్పందించారు. పోడు భూములు ఇప్పిస్తామని చెప్పి ఎవరు పేదల వద్ద డబ్బులు వసూలు చేసినా, భూములు ఆక్రమించి అక్రమాలకు పాల్పడ్డ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.